వంటింట్లో గ్యాస్‌ మంట

6 Feb, 2021 03:47 IST|Sakshi

తాజాగా రూ.25 మేర పెంచడంతో సిలిండర్‌ ధర రూ.771.50   

సాక్షి,హైదరాబాద్‌: వంటింట్లో గ్యాస్‌ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్‌ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర రూ.125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. గతేడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 646.50 ఉండగా.. చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్‌లోనే రూ.100 మేర ధర పెంచాయి. దీంతో ధర రూ. 746.50కు చేరింది.

తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్‌ ధర రూ.771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్‌ ధరలో రూ.520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ.200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారులకు వచ్చేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ.40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. పెట్రో ధరలు సైతం మండుతూనే ఉన్నాయి.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు