బండపై మళ్లీ రూ.50

2 Mar, 2023 02:04 IST|Sakshi

14.2 కేజీల గృహావసర సిలిండర్‌పై రూ.50 పెంపు 

రాష్ట్ర ప్రజలపై నెలకు రూ.50 కోట్ల అదనపు భారం 

వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 350.50 పెంపు 

భారం కానున్న హోటల్‌ తిండి 

మహిళా దినోత్సవానికి మోదీ ఇచ్చిన కానుక: మంత్రి గంగుల 

సాక్షి, హైదరాబాద్‌: పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజానీకంపై మరో బాదుడు. ఎనిమిది నెలల విరామం తరువాత చమురు సంస్థలు మరోసారి గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచేశాయి. 14.2 కిలోల గృహావసర సిలిండర్‌పై రూ. 50 పెంచగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై రూ. 350.50 పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో గృహావసరాల సిలిండర్‌ రేటు రూ.1,105 నుంచి రూ.1,155కి చేరింది. కాగా, గ్యాస్‌ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రెండేళ్లుగా వినియోగదారులకు నగదు బదిలీ నిలిచిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో 1.16 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు 68.74 లక్షలు కాగా, డబుల్‌ గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్లు 48 లక్షలు. ఇవి కాకుండా దీపం కనెక్షన్లు 19.72 లక్షలు, ఉజ్వల కనెక్షన్లు 11.46 లక్షలు, సీఎస్‌ఆర్‌ కింద 7.30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులను బట్టి సిలిండర్ల వినియోగంలో తేడాలున్నా... సాధారణ కుటుంబానికి సగటున నెలకు ఒక సిలిండర్‌ అవసరమవుతుంది. గ్రామాల్లో కొంత తక్కువ వినియోగం ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి నెలా కోటి సిలిండర్లకు పైగా రీఫిల్‌ కోసం వస్తాయనుకున్నా... నెలకు అదనపు భారం రూ. 50 కోట్లకుపైనే ఉంటుందని చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి.  
 
హోటల్‌ తిండి భారమే.. 
వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు ఎకాఎకిన రూ. 350.50 పెంచేశాయి. దీంతో హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే ఈ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.1,973 నుంచి రూ. 2,323.50కి చేరినట్లయింది. ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో సిలిండర్‌ ధర మరింత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది.  
 
మహిళలను వంచించిన కేంద్రం: మంత్రి గంగుల కమలాకర్‌ 
గ్యాస్‌ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం మహిళలను మరోసారి వంచించింది. వారం రోజుల్లో మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం దేశ మహిళలకు గ్యాస్‌ ధరలను పెంచి కానుకగా ఇచ్చింది. అదానీ నష్టాలను పూడ్చుకునేలా సామాన్యుల నుంచి గ్యాస్‌ ధరల రూపంలో వసూలు చేస్తోంది. అధ్వానపు విధానాలతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైన కేంద్రం.. ఏమాత్రం మానవత్వం ఉన్నా పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలి.    

మరిన్ని వార్తలు