వంటింట్లో గ్యాస్‌ మంట 

6 Feb, 2021 08:10 IST|Sakshi

గృహ వినియోగ సిలిండర్‌ ధరలు పైపైకి

తాజాగా రూ. 25 మేర పెంచడంతో సిలిండర్‌ ధర రూ. 771.50  

సాక్షి, హైదరాబాద్‌ : వంటింట్లో గ్యాస్‌ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్‌ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధర రూ. 125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. నిజానికి గత ఏడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 646.50గా ఉండగా చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్‌లోనే రూ. 100 మేర ధర పెంచాయి. దీంతో సిలిండర్‌ ధర రూ. 746.50కు చేరింది. జనవరిలో ఈ ధరలు స్ధిరంగా కొనసాగినా తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్‌ ధర రూ. 771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్‌ ధరలో రూ. 520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది.

ఈ లెక్కన రూ. 200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ. 40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. రాయితీల్లో భారీగా కోత పడటంతో సిలిండర్‌ ధర పెరిగినప్పుడల్లా ఆ భారమంతా వినియోగదారులపైనే పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.18 కోట్ల గృహావసర సిలిండర్‌లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతోంది. పెరిగిన ధరలు, రాయితీల్లో కోతతో ఏటా రూ. వేల కోట్ల మేర సామాన్యుడిపై భారం పడుతోంది.

పెట్రో ధరల దూకుడు... 
రాష్ట్రంలో పెట్రో ధరలు మండుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్‌ ధరలను పెంచుతుండటంతో పెట్రోల్‌ ధర పది రోజుల వ్యవధిలోనే రూ. 1.27 పైసలు పెరిగింది. జనవరి 25న పెట్రోల్‌ ధర రూ. 89.15 ఉండగా ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రల్‌ ధర రూ. 90.42కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకు సగటున 13 నుంచి 15 కోట్ల లీటర్ల మేర పెట్రోల్‌ వినియోగం ఉంటోంది. ఈ లెక్కన పది రోజుల్లోనే వినియోగదారులపై రూ. 19 కోట్ల మేర భారం పడింది. ఇక డీజిల్‌ ధర సైతం పెట్రోల్‌తో పోటీ పడుతోంది. ఈ పది రోజల వ్యవధిలోనే దాని ధర సైతం రూ. 1.34 మేర పెరిగింది. గత నెల 25న లీటర్‌ ధర రూ. 82.80 ఉండగా అది ప్రస్తుతం రూ. 84.14కి చేరింది.  
 

మరిన్ని వార్తలు