ఫాస్ట్‌ఫుడ్స్‌ హానికరం కాదు.. వాటిలో కలిపేవే అత్యంత ప్రమాదకరం

20 Mar, 2023 09:19 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తినే ఆహారమే వ్యక్తి ఆయుష్షును నిర్ణయిస్తుందని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ వ్యవస్థాపకుడు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన రీజినల్‌ అకడమిక్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన విశిష్టవక్తగా పాల్గొన్నారు. ‘గ్యాస్ట్రో­ఎంట్రాలజీలో తాజా పురోగతులు’, ‘వ్యక్తిగా విజయం సాధించేందుకు దోహదంచేసే అంశాలు’ అనే అంశాలపై ఆయన మాట్లాడారు.

ఫాస్ట్‌ఫుడ్స్‌ హానికారకం కాదని, రంగు, రుచి, వాసన, నిల్వసామర్థ్యం పెంచేందుకు వాటిలో కలిపే అడెటివ్స్‌ (సంకలనాలే) అత్యంత ప్రమాదకరమని తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థతో కలిసి గత ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మంచినీటి సరఫరా, నాణ్యతను విస్తృతం చేసి విజయవంతమైందని చెప్పారు. ఈ చర్య వల్ల నీటి ద్వారా వ్యాపించే ఎన్నో అనారోగ్యాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.

కేవలం జంక్‌ఫుడ్స్‌ తినడానికి అలవాటుపడిన వారిలో వయసుతో నిమిత్తంలేని జీర్ణకోశ వ్యాధులను గుర్తిస్తున్నామని తెలిపారు. క్రోన్స్‌ డిసీజ్, ఐబీడీ, అల్సరేటివ్‌ కొలైటీస్‌ ఎక్కువగా నమోదవుతు­ం­డడం ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. అనంతరం జీవితంలో విజయాని­కి దోహదం చేసే అంశాలపై చర్చించారు. సమయపాలన, ఎప్పటిపని అప్పుడే పూర్తిచేసే లక్షణం, నిరంతరం నేర్చుకునే ఆసక్తి ఏ వ్యక్తినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి చెప్పారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు