వారం రోజుల్లో గేట్‌ నోటిఫికేషన్‌ 

28 Jul, 2022 01:36 IST|Sakshi

సెప్టెంబర్‌లో దరఖాస్తుల ప్రక్రియ 

ఫిబ్రవరిలో పరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది మంది ఎదురుచూసే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)–2023 నోటిఫికేషన్‌ మరో వారం రోజుల్లో విడుదలవ్వనుంది. ఇందుకోసం కాన్పూర్‌ ఐఐటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గేట్‌ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం సెప్టెంబర్‌లో గేట్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలయ్యే వీలుంది. 2023 ఫిబ్రవరి 4 నుంచి 13 తేదీల మధ్య పరీక్ష నిర్వహించాలని కాన్పూర్‌ ఐఐటీ నిర్ణయించినట్టు తెలిసింది.

దేశంలోని ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు చేయడానికి గేట్‌ స్కోర్‌ కీలకమైంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా గేట్‌ ర్యాంకు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. బీటెక్‌తో పాటు సంప్రదాయ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా గేట్‌ రాస్తారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఏడాది నుంచే ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. గత ఏడాది 7.11 లక్షల మంది గేట్‌ రాశారు. వీరిలో 1.26 లక్షల మంది అర్హత సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 1.25 లక్షల మంది గేట్‌ రాస్తుంటారు.   

మరిన్ని వార్తలు