ఒక్కటి తప్ప అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు

15 Oct, 2020 04:55 IST|Sakshi
బుధవారం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఉరకలెత్తుతున్న వరద నీరు

నిజాంసాగర్‌ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్‌

నాలుగేళ్ల తర్వాత తెరుచుకున్న సింగూరు గేట్లు

నిజాంసాగర్‌కు భారీ వరద.. నేడు గేట్లు ఎత్తే అవకాశం

కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న వరద

43 వేల చెరువులకుగానూ 36 వేల చెరువులు పూర్తిగా ఫుల్‌

152 చోట్ల చెరువులకు గండ్లు..

ఈ సీజన్‌లో మొత్తంగా 661 చెరువులకు నష్టాలు..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో నిజాంసాగర్‌ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీ ప్రవాహాలు నమోదు కావడంతో నాలుగేళ్ల తర్వాత బుధవారం సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ఈ నీరంతా నిజాంసాగర్‌కు వెళ్తుండటంతో అక్క డా ప్రవాహాలు పెరిగాయి. నేడో రేపో ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ సహా అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

తెరుచుకున్న సింగూరు గేట్లు...
సింగూరు ప్రాజెక్టులో బుధవారం ఉదయం మూడు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకుగానూ 28.22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తుండటంతో ఈ నీరంతా నిజాంసాగర్‌ వైపు పరుగులు పెడుతోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 41,851 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నిల్వ 17.80 టీఎంసీలకుగానూ 11.10 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నిల్వ 16 టీఎంసీలకు చేరి, ప్రవాహాలు ఇదే రీతిన ఉంటే గురువారంరాత్రిగానీ, శుక్రవారంగానీ గేట్లు ఎత్తే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీకి కాస్త ప్రవాహాలు తగ్గాయి. బుధవారం 24 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. లోయర్‌ మానేరుకు 96 వేల క్యూసెక్కులు, మిడ్‌మానేరుకు 29వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 82 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ ప్రాజెక్టులన్నీ నిండి ఉండటంతో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా బేసిన్‌లో ప్రవాహ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలంలోకి 3.47 లక్షలు, సాగర్‌లోకి 2.73 లక్షలు, పులిచింతలకు 4.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. ఈ నీటినంతా దిగువకు విడిచి పెడుతుండటంతో బంగాళాఖాతం వైపు వెళుతోంది. 

అలుగు దుంకుతున్న 24,192 చెరువులు
రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులకు జలకళ వచ్చింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రాష్ట్రంలో కృష్ణా, గోదావరి బేసిన్‌లో 24,192 చెరువులు అలుగు దుంకుతున్నా యి. మరో 11,972 చెరువులు వందకు వంద శాతం నీటితో అలుగులు దుంకేందుకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణాబేసిన్‌లో 23,301 చెరువులకుగానూ 14,900 చెరువులు నిండగా, మరో 3,766 చెరువులు పూర్తిగా నిండాయి. అత్యధికంగా మెదక్‌ జిల్లా పరిధిలో 6,993 చెరువులు అలుగు పా రుతుండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 4,644 చెరువులు అలుగు దుంకుతున్నాయి. గోదావరి బేసిన్‌లో మొత్తంగా 20,111 చెరువులుండగా, ఇందులో 9,292 చెరువులు అలుగు పారుతున్నా యి. మరో 8,206 చెరువులు వంద శాతం మేర నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 2,795 చెరువులు, కరీంనగర్‌లో 2,578 చెరువులు, వరంగల్‌ జిల్లాలో 2,209 చెరువులున్నాయి. మంగళ, బుధవారం కురిసిన భారీ వర్షాలకు 152 చెరువులకు గండ్లు పడ్డాయి. మొత్తంగా ఈ సీజ న్‌లో 661 చెరువులకు గండ్లు, బుంగలు పడటం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. 

మరిన్ని వార్తలు