వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు రాజీనామా

4 Apr, 2021 01:42 IST|Sakshi

జాతీయ పార్టీలో చేరుతానని శ్రీకాంత్‌రెడ్డి వెల్లడి 

పార్టీలో జగన్‌ ఎంతో ప్రాధాన్యమిచ్చారు 

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో పార్టీ విస్తరణ లేకపోవటంతో తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌ ప్రజల అభిమతం మేరకు ఓ జాతీయపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. 2007 నుంచి తాను పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నానని, పార్టీలో తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గ బాధ్యతలతోపాటు జిల్లా ఇన్చార్జిగా, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. ఇలా అవకాశాలు ఇస్తూ ఎంతో ప్రోత్సహించారని, ఇందుకు తానెప్పుడూ జగన్‌కు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీని వీడాలని బాధతో నిర్ణయం తీసుకున్నానని, ఈ రోజు తనకు దుర్దినమేనని ఆయన అభివర్ణించారు. అద్భుతమైన పాలనతో ఏపీని ప్రగతిపథంలో ఉంచిన జగన్ మోహన్ రెడ్డికి భవిష్యత్తులో మరిన్ని గొప్ప అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులు అల్లాడుతుండటం బాధగా ఉందని, తాజాగా ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం తనను కలచివేసిందని అన్నారు.

యాదాద్రి దేవాలయానికి నిధులు ఇవ్వటం తప్ప నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. దేశభక్తితో ముందుకు సాగుతున్న జాతీయ పార్టీలో చేరనున్నానని, తాను వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి హుజూర్‌నగర్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో డబ్బే గెలుస్తుందని, డబ్బు కావాలో, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.    

మరిన్ని వార్తలు