Omicron Variant: సాధారణ జలుబుగానే వచ్చి వెళ్లిపోతోందని ఒమిక్రాన్‌ను లైట్‌ తీసుకోవద్దు!

21 Jan, 2022 02:49 IST|Sakshi

వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులున్నవాళ్లకు ప్రమాదమే 

వచ్చే మూడు వారాలు జాగ్రత్త 

పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు 

కొత్త వేరియంట్లు రావని చెప్పలేం 

‘సాక్షి’తో ఇంటర్వ్యూలో జనరల్‌ ఫిజీషియన్‌ ప్రభుకుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌తో ఏమీ కాదని అజాగ్రత్తగా ఉండొద్దని జనరల్‌ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్‌ డా. ప్రభుకుమార్‌ చల్లగాలి (లైఫ్‌ మల్టీస్పెషాలిటీ క్లినిక్స్‌) హెచ్చరించారు. వృద్ధులు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై డెల్టా, ఒమిక్రాన్‌ల తీవ్రత ఒకేలా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు.

డెల్టా రకంతో ఇంకా ప్రమాదమేనని చెప్పారు. వచ్చే మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వేరియెంట్‌తో పిల్లలకు ముప్పేమీ లేదని చెప్పారు. కరోనా కొత్త మ్యుటేషన్లు వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. వివిధ అంశాలపై ‘సాక్షి’తో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

పండుగలప్పుడు నిర్లక్ష్యం వల్లే.. 
ఒమిక్రాన్‌ చాలా మటుకు సాధారణ జలుబుగానే వెళ్లిపోతోంది. చాలా మంది మూడు నుంచి ఐదు రోజుల్లోనే మామూలై పోతున్నారు. కరోనా లక్షణాల్లో ఇప్పుడు ఎక్కువగా గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, కీళ్లు, కాళ్ల నొప్పులే ఉంటున్నాయి. ఎవరికైతే రెండు, మూడు రోజుల్లో వైరస్‌ తీవ్రత తగ్గట్లేదో, ఆక్సిజన్‌ సాచురేషన్‌ 95 శాతం కంటే తగ్గుతోందో వారిపై వైద్యులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తీవ్రంగా మారుతున్న వారికే యాంటీ వైరల్‌ మందులు ఇస్తున్నారు.

అయితే ఒమిక్రాన్‌ స్వల్ప లక్షణాలతో ప్రభావం చూపుతోందని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. అందరికీ ఇది సోకే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మనకూ వచ్చి పోతే మంచిదని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. రాబోయే 3 వారాలు అనవసర ప్రయాణాలు నియంత్రించి జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్‌ వేవ్‌ క్రమంగా తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. 

ఒమిక్రానే ప్రధాన వేరియెంట్‌గా మారితే.. 
అన్ని దేశాల్లో డెల్టాను అధిగమించి ఒమిక్రాన్‌ ప్రధాన వేరియెంట్‌గా మారి 95 శాతం ఈ కేసులే వచ్చినపుడు కరోనా దాదాపుగా తగ్గిపోతుందనేది ఒక అంచనా. నెదర్లాండ్స్, అమెరికా, యూకేలలో 95 శాతం కేసులు ఒమిక్రాన్‌వే ఉంటున్నాయి. మనదేశంలోనూ డెల్టా కేసులను ఒమిక్రాన్‌ కేసులు అధిగమిస్తే ఇక్కడా గణనీయమైన మార్పులు వస్తాయి.  

ఏదో ఓ మూల నుంచి మళ్లీ రావొచ్చు 
వందేళ్ల క్రితం వచ్చిన స్పానిష్‌ ఫ్లూ.. ఒకటి, రెండు వేవ్‌లు ప్రభావం చూపి థర్డ్‌ వేవ్, ఫోర్త్‌ వేవ్‌తో ముగిసింది. ఇప్పుడు కరోనాలోనూ ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐతే వైరస్‌ పూర్తిగా అంతర్థానమై పోదని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అనేక వైరస్‌లు సజీవంగా ఉంటాయి. ఏదో ఓ మూల నుంచి మళ్లీ వచ్చే అవకాశాలు లేకపోలేదు.   

మరిన్ని వార్తలు