జర్మనీ పెట్టుబడుల కోసం..ప్రత్యేక క్లస్టర్‌

7 Dec, 2021 04:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులతో భారత్‌కు వచ్చేవారికి తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయమైన గమ్యస్థానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లో పెట్టుబడులకు అనేక అనుకూలతలు ఉన్నా యని చెప్పారు. జర్మనీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రత్యేక క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పని ప్రదేశాల్లోనే ఉద్యోగులు, కార్మికులకు నివాస వసతి కల్పించేలా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని మంత్రి వెల్లడించారు. ఇండో జర్మన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో సోమవారం సంయుక్తంగా నిర్వహించిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో కేవలం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని కేటీఆర్‌ తెలిపారు. ఇటీవలి కాలంలో యంత్ర, ఎలక్ట్రానిక్‌ వాహన తయారీ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా పరిస్థితుల్లో తయారీ రంగం చైనా నుంచి తరలేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్‌ ప్రత్యేకించి తెలంగాణ ఈ తరహా పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలో జర్మనీ పెట్టుబడిదారులు కూడా తెలంగాణకు తరలివస్తే స్వాగతం పలికేందుకు సిద్ధమన్నారు.

ఐపాస్‌ ద్వారా సులభతర అనుమతులు 
పారిశ్రామిక అవసరాలకు వీలుగా రాష్ట్రంలో 3.2 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, టీఎస్‌ఐపాస్‌ ద్వారా సులభతర అనుమతులు లభించేలా చూస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. జర్మనీ జీడీపీలో 80 శాతానికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచే సమకూరుతోందని, అదే తరహాలో తెలంగాణలోనూ చిన్న, మధ్య తరహా సంస్థలతో పనిచేసేందుకు జర్మనీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని మంత్రి కోరారు.  

జర్మనీ తరహాలో..డ్యూయల్‌ డిగ్రీ కోర్సుల యోచన 
జర్మనీ దేశంలో అమలులో ఉన్న డ్యూయల్‌ డిగ్రీ తరహా కోర్సులను రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జె.లిండ్నర్, చెన్నైలో జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ కెరిన్‌ స్టోల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.   

రూ.1,500 కోట్ల పెట్టుబడి .. 27 వేల మందికి ఉపాధి 
జర్మన్‌ పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆ దేశానికి చెందిన ‘లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌’తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జె.లిండ్నర్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఈ ఎంవోయూ కుది రింది. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, లైట్‌ ఆటో ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణలో లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఆధునిక డిజైనింగ్, తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఎలక్ట్రిక్, ఐసీఈ వాహన రంగంలో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహనాలకు అవసరమైన మెగ్నీషియం ఉత్పత్తులను తయారు చేస్తుంది. దీని ద్వారా 9 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18 వేల మందికి పరోక్షంగా.. మొత్తంగా 27 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.    

మరిన్ని వార్తలు