ఎయిర్‌పోర్ట్‌ సిటీలో ఎడ్యుపోర్ట్‌ 

21 Aug, 2020 01:30 IST|Sakshi

ప్రపంచస్థాయి ప్రమాణాల మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ 

సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో జీహెచ్‌ఏఎల్‌ ఒప్పందం 

100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్‌ క్లస్టర్‌ నిర్మాణం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో అద్భుతమైన విద్యాసంస్థ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘ఎడ్యుపోర్టు’రూపుదిద్దుకోనుంది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిరొట్రోపొలిస్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఏఎల్‌) ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే సెయింట్‌మేరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎమ్మార్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

రానున్న మూడేళ్లలో వినియోగంలోకి తేవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా విద్య, పరిశోధనా సంస్థలను అభివృద్ధి చేసే లక్ష్యంతో జీహెచ్‌ఏఎల్‌ ఈ అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ‘ఎడ్యుపోర్ట్‌’పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనుసంధానమై ఉంటుంది. అన్ని వయసులు, నేపథ్యాలు కలిగిన విద్యార్థులకు అవసరమైన అధ్యయన కోర్సులను ఇందులో అందుబాటులోకి తెస్తారు.  

ఓ నాలెడ్జ్‌ హబ్‌గా.. 
ఇక ఈ ఎడ్యుపోర్ట్‌ను ఓ నాలెడ్జ్‌ హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. లెర్నింగ్, ట్రైనింగ్, రీసెర్చ్, ఇన్నొవేషన్‌ సెంటర్‌గా ఈ ఎడ్యుపోర్ట్‌లో బిజినెస్‌ స్కూల్, ఇంటర్నేషనల్‌ స్కూల్, ఏవియేషన్‌ అకాడమీ, ఎయిరోస్పేస్‌ ఇంజ నీరింగ్, ఫ్లైట్‌ ట్రైనింగ్, సిమ్యులేటర్‌ ట్రైనింగ్, ఇంజిన్‌ మెయింటెనెన్స్‌ వంటి వాటిలో బోధన, శిక్షణ ఉంటాయి. ఇక ఈ ఎడ్యుకేషన్‌ క్లస్టర్‌లో చిన్మయ విద్యాలయ, షూలిచ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, జీఎమ్మార్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లైట్‌ సిమ్యులేషన్‌ టెక్నిక్‌ సెంటర్, సీఎఫ్‌ఎం సౌత్‌ ఏసియా ట్రైనింగ్‌ సెంటర్, ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇండియా ట్రైనింగ్‌ సెంటర్‌ వంటి సంస్థలు భాగం పంచుకోనున్నాయి.

మరోవైపు రెసిడెన్షియల్‌ అకడమిక్‌ సదుపాయం కలిగిన సాంక్టా మారియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మాణం కోసం సెయింట్‌ మేరీస్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీతో ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇది ఆహ్వానించదగిన పరిణామమని జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు బిజినెస్‌ మేనేజర్‌ జీబీఎస్‌ రాజు అన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌  పెరుగుతుందని చెప్పారు. ఎయిర్‌పోర్టు ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ సీఈవో అమన్‌కపూర్‌ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సిటీలో ఏర్పాటవుతున్న మొదటి విద్యాసంస్థ ఇది. ప్రపంచస్థాయి విద్య, పరిశోధనా సంస్థలను నెలకొల్పి, ఉన్నత విద్యను అందించే వ్యవస్థను నెలకొల్పాలన్న మా లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది’అని వ్యాఖ్యానించారు.  

మరిన్ని వార్తలు