చాయ్‌కీ డబ్బులు లేవు.. ‘నేను కూడా సీఎం  సమావేశానికి వెళ్లేది లేదు’

8 Aug, 2022 08:59 IST|Sakshi
ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తే దేశం మొత్తం చర్చ జరుగుతుందని సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్‌లాగే సోమవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఘట్‌కేసర్‌ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు.

మేడ్చల్‌ జిల్లా అవుషాపూర్‌లో ఆదివారం ఆయన ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివద్ధికి నిధులు విడుదల చేయాలని మూడేళ్లుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గాల తరఫున మంత్రులు, అధికారుల చుట్టూ  తిరిగినా నిధులు విడుదల చేయనందున మండల పరిషత్‌ కార్యలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశానన్నారు.

నిధుల విడుదలపై చర్చ జరగాలనే సీఎం నేతృత్వంలోని సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఎందుకంటే సీఎం సమావేశంలో చర్చించే అవకాశం తమకు రాదన్నారు. సమావేశాన్ని బహిష్కరిస్తే చర్చ జరిగి నిధులు వస్తాయన్న నమ్మకం ఉందని, మూడేళ్లుగా మండల పరిషత్‌ సమావేశాల్లో చాయ్‌ డబ్బులు చెల్లిద్దామన్న నిధులు లేని దుస్థితి ఉందన్నారు. నిధులు విడుదలపై అధికారులు, మంత్రులు కూడా స్పందించడం లేదని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు.
చదవండి: ట్రాఫిక్‌ రద్దీకి చెల్లు.. సైబరాబాద్‌ పోలీసుల కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు