GHMC: వాటర్‌ ఏటీఎం.. ఎనీ టైం మూసుడే

31 Mar, 2022 07:25 IST|Sakshi

ఉన్న వాటికే దిక్కులేదు.. కొత్తగా మళ్లీ టెండర్లట

ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుకిచ్చేందుకేనా?  

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకని మూడేళ్ల క్రితం నగరవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో వాటర్‌ ఏటీఎంల పేరిట కియోస్క్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీలకు స్థలాలు కేటాయించిన జీహెచ్‌ఎంసీ.. అవి పనిచేయకున్నా.. పత్తాలేకుండా పోయినా పట్టించుకోలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ వేసవి రావడంతో 60 ప్రాంతాల్లో ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రైవేటు ఏజెన్సీలు శుద్ధమైన నీటిని 24 గంటల పాటు  తక్కువ ధరకు అందజేయాలనే తలంపుతో గతంలో వీటిని ఏర్పాటు చేశారు.

కొద్దిరోజులు మాత్రం పనిచేసిన ఇవి క్రమేపీ పనిచేయడం మానేశాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా తెరవలేదని చెబుతున్నారు. ఇప్పుడు తిరిగి మళ్లీ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నారు. రోజుకు  5వేల నుంచి 10వేల లీటర్ల తాగునీటిని పంపిణీ చేసే, ఈ అంశంలో తగిన అనుభవమున్న సంస్థలను ఈసారి పిలుస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కియోస్క్‌ ఇన్‌స్టలేషన్, విద్యుత్‌ చార్జీలు, ట్రేడ్‌లైసెన్స్‌ తదితరాలన్నీ  ఏజెన్సీ బాధ్యతే అని చెప్పారు. అంతేకాదు.. కేటాయించిన స్థలానికి లీజు ధర కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

టెండరు దక్కించుకునే సంస్థలకు మూడేళ్ల వరకు సదరు స్థలాల్ని లీజుకిస్తామని, పనితీరును బట్టి అనంతరం పొడిగింపు ఉంటుందని తెలిపారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, నిర్వహణ చేయని వాటిపై ఎలాంటి చర్యలు ఉండకపోవడంతో ఏర్పాట్లకు ఉత్సాహం చూపుతున్న సంస్థలు.. అనంతరం చేతులెత్తేస్తున్నాయి. దాని బదులు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోనే వాటర్‌బోర్డుతో ఒప్పందం కుదుర్చుకొని, కియోస్క్‌లలో పనిచేసే వారికి మాత్రం వేతనాలు చెల్లించడమో లేక మరో ప్రత్యామ్నాయమో చూపితే మేలనే అభిప్రాయాలున్నాయి.

లేదా సీఎస్సార్‌ కింద నిర్వహణను కార్పొరేట్‌ సంస్థలకిచ్చినా ఉపయోగముంటుందని చెబుతున్నవారు కూడా ఉన్నారు. వాటర్‌ కియోస్క్‌లు, లూకేఫ్‌ల ఏర్పాటు పేరిట విలువైన స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు లీజు కివ్వడం అవి లీజుఅద్దెలు చెల్లించకున్నా, ఒప్పందానికనుగుణంగా పనులు చేయకున్నా చర్యలు లేకపోవడంతో  ఇలాంటి విధానాల వల్ల ప్రభుత్వ స్థలాలు.. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లు వంటివి సైతం అన్యాక్రాంతమై ఇతర వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

జోన్‌కు 10 చొప్పున.. 
జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో జోన్‌కు పది చొప్పున మొత్తం 60 వాటర్‌ కియోస్క్‌ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. వాటి టెండరు పూర్తయి.. ఇన్‌స్టలేషన్‌.. తదితర కార్యక్రమాలు ముగిసి అందుబాటులోకి వచ్చేప్పటికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఈలోగా వేసవి ముగిసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. టెండరు పొందే సంస్థలకు 300 చదరపు అడుగుల స్థలాన్ని  జీహెచ్‌ఎంసీ కేటాయిస్తుంది. టెండరు ద్వారా కాంట్రాక్టు దక్కించుకునే సంస్థలు ప్రజలు శుద్ధమైన, చల్లని నీటిని దిగువ ధరలకు అందజేయాలి.

(చదవండి: హైదరాబాద్‌ డాక్టర్‌కు బ్రిటిష్‌ అత్యున్నత అవార్డు)

మరిన్ని వార్తలు