GHMC: ప్రచారం నేతలది.. ఖర్చు జీహెచ్‌ఎంసీది.. ఎలాగంటారా?

20 Oct, 2021 19:41 IST|Sakshi
ఫ్లెక్సీలు తొలగిస్తున్న డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

బంజారాహిల్స్‌: రాజకీయ నేతలు రోడ్లకిరువైపులా, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్‌పాత్, రోడ్లను సైతం ఆక్రమిస్తుండటంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్‌పాత్‌లపై పెద్ద పెద్ద కర్రలు  పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

కూడళ్లలో చెట్లను తొలగించి, గడ్డిని సైతం తవ్వి ఏర్పాటు చేస్తున్నారు. రహదారుల పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని అగ్రసేన్‌ చౌరస్తాలో భారీ వర్షంలో వెళ్తున్న ఓ వ్యక్తిపై ఫ్లెక్సీ పడగా ఈ ఘటనలో బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. 
(చదవండి: Huzurabad Bypoll: మాట ముచ్చట: అయిలన్నా.. ఏం నడ్తందే?)

సొంత నిధులతో..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ప్రతి రోజూ ఏదో ఒకటి కొత్త కటౌట్లు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ నిలదీస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నామంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇంత వరకు ఎవరి దగ్గర కూడా జరిమానాలు వసూలు చేసినట్లు కనిపించడం లేదు.  

ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రం డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చి వాటిని తొలగిస్తున్నారు. కటౌట్లు ఏర్పాటు చేసిన నేత వాటిని తొలగించే ఖర్చు నుంచి తప్పించుకుంటుండగా జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందం మాత్రం తమ సొంత సిబ్బందితో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ వాటిని తొలగిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. కటౌట్‌ పెట్టిన నేత వాటిని తొలగించే బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి ఉండగా జీహెచ్‌ఎంసీ పుణ్యమా అంటూ తొలగించే ఖర్చులు మిగులుతున్నాయి. 
(చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..)

>
మరిన్ని వార్తలు