వివాదాలు ఘనం.. అభివృద్ధి శూన్యం

18 Feb, 2022 01:51 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల ఏడాది పాలన పూర్తి 

ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్యనిత్యం ఆదిపత్యపోరు 

పరిష్కారం కాని సమస్యలు.. కనిపించని అభివృద్ధి  

ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కార్పొరేటర్ల సంవత్సర పాలన ముగిసింది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకుంటూ టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధిని మరిచారు. ఏడాది క్రితం ఉత్కంఠ భరితంగా సాగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఒక్క భోలక్‌పూర్‌ డివిజన్‌ మినహా ఐదు డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

స్థానిక ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ నేత కావడం, గెలిచిన కార్పొరేటర్లంతా బీజేపీ వారు కావడంతో ప్రతి విషయంలోనూ ఆదిపత్యపోరు కొనసాగించారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో వివాదాలు ఎక్కువై అభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలు తక్కువే.  

ఎమ్మెల్యే తమను విస్మరిస్తున్నారంటూ.. 
నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తమకు సమాచారం ఇవ్వడం లేదని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తమను విస్మరిస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ఏడాది నుంచి ఇదే వివాదం కొనసాగుతూ వస్తోంది. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్లు మరోసారి శంకుస్థాపనం చేయడం, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు వివాదాలకు దిగడం నిత్యం పరిపాటిగా మారింది.

ముషీరాబాద్‌ చేపల మార్కెట్, ఆదర్శ కాలనీ, రాంనగర్‌ డివిజన్‌లోని జెమినీ కాలనీ, బాగ్‌లింగంపల్లి.. ఇలా ప లు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ చేపట్టిన అభివృద్ధి పనుల సందర్భంగా కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.  

కార్పొరేటర్లకు నిధులు నిల్‌.. 
కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాది గడిచినా డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం వారికి నిధులు కేటాయించలేదు. దీంతో వారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వతహాగా చేపట్టలేకపోయారు. డ్రైనేజీ, తాగునీటి కలుషితం, వీధి దీపాలు, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు వంటి పలు సమస్యల విషయంలో ప్రజాప్రతినిధులు ఫొటోలు తీయించుకోవడం వరకే పరిమితమయ్యారు.

సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై ఒత్తిడి పెంచడం తప్ప ప్రజల సమస్యలను పరిష్కరించిన దాఖలాలు పెద్దగా కనిపించలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు అనేక రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హడావిడిగా శంకుస్థాపనలు చేశారు. ఆ పనులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులుచేపట్టింది లేదు. 

మరిన్ని వార్తలు