కొత్త టీమ్‌.. గెజిట్‌లో నేమ్‌

17 Jan, 2021 03:26 IST|Sakshi

బల్దియా కార్పొరేటర్ల పేర్లతో ఎస్‌ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ 

ఈ నెల 27న సర్వసభ్య, బడ్జెట్‌ సమావేశాలు?

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ)కి కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్ల పేర్లు ఎట్టకేలకు గెజిట్‌లో నమోదయ్యాయి. రిజర్వేషన్లు, పార్టీలవారీగా కార్పొరేటర్ల వివరాలతో శనివారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఐదు వారాల తర్వాత అధికారికంగా వారి పేర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) గెజిట్‌లో ప్రచురించింది. బల్దియాలో ఇంతకు ముందెన్నడూ పాలకమండలి గడువు ముగిశాకే ఎన్నికలు జరిగినందున ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చేనెల పదో తేదీవరకు ఉండటం, అప్పటివరకు కొత్త పాలకమండలి కొలువుదీరే అవకాశం లేకపోవడంతో ఇప్పటిదాకా గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువరించలేదు.

నిబంధనల మేరకు గెజిట్‌లో ప్రచురించాక నెలరోజుల్లోగా కొత్తపాలకమండలి సభ్యుల ప్రమాణం, మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో వచ్చే నెల 15 లోగా ఈ కార్యక్రమాలు పూర్తికానున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతోపాటు వారి ఎన్నికకు ఎన్నికల అధికారిగా గ్రేటర్‌ పరిధిలోని జిల్లాలకు చెందిన కలెక్టర్‌ లేదా జాయింట్‌ కలెక్టర్‌ను నియమిస్తారని సంబంధిత అధికారి తెలిపారు. 

మేయర్‌ఎన్నిక ఇలా..
ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు అర్హులు. మేయర్‌ పదవికి మహిళారి జర్వేషన్‌ ఉన్నందున మహిళలే పోటీచేయాల్సి ఉంది. కార్పొరేటర్లతోపాటు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్న రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటు వేసే అర్హత ఉంది. మేయర్‌ ఎన్నికకు ఎక్స్‌అఫీషియో సభ్యులుసహ మొత్తం సభ్యుల్లో కనీసం 50 శాతం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. నిర్ణీత వ్యవధిలోగా తగినంతమంది ఓటర్లు రాకపోతే మర్నాటికి వాయిదా వేస్తారు. అప్పుడు కూడా కోరం లేకపోతే ఎన్నికల సంఘం సూచనల మేరకు కోరం లేకపోయినప్పటికీ మేయర్‌ ఎన్నిక నిర్వహిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికలో విప్‌ వర్తిస్తుంది. బహిరంగంగా చేతులెత్తడం ద్వారా ఎన్నికను నిర్వహిస్తారు. 

27న బడ్జెట్‌ సమావేశం?
ప్రస్తుత సభ్యులతో చివరి సర్వసభ్య సమావేశాన్ని ఈ నెలాఖరులోగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా, కోవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు జరగలేదు. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2021–22) సంబంధించి జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ కూడా పాలకమండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే స్టాండింగ్‌ కమిటీ ఆమోదం పొందిన బడ్జెట్‌ నిర్ణీత గడువు జనవరిలోగా జనరల్‌బాడీ సమావేశంలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 27న పాలకమండలి సాధారణ సర్వసభ్య సమావేశం, బడ్జెట్‌ భేటీ రెండూ కూడా ఒకేరోజు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సంబంధిత అధికారులు వీటికి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు.   

మరిన్ని వార్తలు