బల్దియా: ఆనాడే తొలి ఓటు..

26 Nov, 2020 10:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అది 1948 సెప్టెంబర్‌ 17.. అప్పటి వరకు రాచరిక పాలనలో ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో 1952 జనవరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. వాటితో పాటే నాటి హైదరాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాదీలు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించారు. 1956లో ఎంసీహెచ్‌ ఏర్పడినా.. అప్పుడు ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక అధికారితోనే బల్దియా పాలన సాగింది. హైదరాబాద్‌ సంస్థానంలో విలీనం అనంతరం హైదరాబాద్‌ బల్దియాకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి..? నిజాం పాలనలో జరిగిన ఎన్నికలు ఎలా జరిగేవి.. తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 

1934 మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోసం మొదటి ఎన్నికల జరిగాయి. కానీ ఇందులో అందరికీ ఓటు వేసే అధికారం ఉండేది కాదు. కేవలం కొంత మందికి మాత్రమే ఓటు వినియోగించే హక్కు నిజాం ప్రభుత్వం కల్పించింది. హైదరాబాద్‌ రాష్ట్రంలో 1952లో మొదటిసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగాయి. ఇందులో మొదటిసారి నగర ప్రజలు ఓటు వినియోగించారు.

1951 నవంబర్‌ 5న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. 15న నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. అప్పట్లో హైదరాబాద్‌ నగరంలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. అందులో ఇద్దరు అభ్యర్థుల నియోజకవర్గాలు రెండు ఉండేవి. అదేవిధంగా పార్లమెంట్‌ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ రోజుల్లో హైదరాబాద్‌ కేవలం ఒక్క నియోజకవర్గంగా ఉండేది. అదేవిధంగా పార్లమెంట్‌ ఎన్నికలు 1951 అక్టోబర్‌ 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరిగాయి.  

రోజుకో నియోజకవర్గంలో పోలింగ్‌ 
రాచరిక వ్యవస్థ అంతరించిన తర్వాత దేశంలో మొదటిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం, సిబ్బంది లేమి వల్ల నాడు రోజుకో నియోజకవర్గంలో పోలింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరానికి సంబంధించి నియోకవర్గాల్లో జనవరి 2 నుంచి 24వ తేదీ వరకు పోలింగ్‌ జరిగింది. మొత్తం స్థానాల్లో పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 15న ఫలితాలను ప్రకటించారు. నిజాం హయాంలో కూడా బల్దియా ప్రతినిధుల కోసం ఎన్నికలు జరిగేవని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఆ రోజుల్లో ప్రజలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం దక్కేదికాదు. ప్రభుత్వం తరఫున కేవలం కొంతమంది ప్రతినిధులు ఓటు వినియోగించే వారు. ప్రజాసామ్య పద్ధతిలో బల్దియా ఎన్నికలు జరిగాయి. మొదట్లో హైదరాబాద్‌ నగరంలోని జీహెచ్‌ఎంసీ 60 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. మొదటి పాలక మండలి 1960 ఆగస్టు 3వ తేదీన కొలువుదీరింది.  

బల్దియా ఎన్నికలు మొదటిసారి  
1956లో ఎంసీహెచ్‌ ఏర్పడింది. అప్పటి నుంచి 1960 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 1960లో మొదటిసారి బల్దియాకు ఎన్నికలు జరిగాయి. రెండవసారి 1964లో.. మూడోసారి 1968లో ఎన్నికలు జరిగాయి. 1968 నుంచి 1986 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. తిరిగి 2002లో బల్దియాకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ 2007లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటికీ ఎంసీహెచ్‌ నుంచి జీహెచ్‌ఎంసీగా మారింది. గ్రేటర్‌ ఏర్పా టు అనంతరం రెండేళ్లకు 2009లో ఎన్నికలు జరిగాయి. 2009 నుంచి 2014 వరకు పాలకమండలి కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏడాదిన్నర తర్వాత మళ్లీ 2016 ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 11న ప్రస్తుత పాలకమండలి కొలువుదీరింది. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. బల్దియాలో ప్రస్తుతం 8వ సారి జరుగుతున్న ఎన్నికలు.

మరిన్ని వార్తలు