ఓటేస్తారా.. టూరేస్తారా..?

28 Nov, 2020 09:07 IST|Sakshi

వరుస సెలవులతో సొంత ఊళ్లకు పయనం 

లాక్‌డౌన్‌ కారణంగా నగరానికి చేరుకోని టెకీలు 

కరోనా నేపథ్యంలో ఓటింగ్‌పైనా ప్రభావం 

గత ఎన్నికల్లో 45 శాతం మాత్రమే పోలింగ్‌ 

సాక్షి,హైదరాబాద్‌: వరుసగా నాలుగు రోజులు సెలవులొచ్చాయంటే చాలు సిటీజనులు ఆకస్మాత్తుగా జంప్‌జిలానీలవుతారు. ఏ టూరిస్ట్‌ ప్లేస్‌కో.. లేదంటే సొంత ఊళ్లకో పరుగులు తీస్తారు. ఆ నాలుగు రోజులు సరదాగా గడిపి వచ్చేస్తారు.  సహజంగానే ఎన్నికల పట్ల పెద్దగా ఆసక్తి లేని వర్గాలకు ఈ వరుస సెలవులు ఒక వరంలా మారుతున్నాయి.

డిసెంబర్‌ 1వ తేదీన జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు కూడా వరుస సెలవుల గండం వచి్చపడింది. ఆఖరు శనివారం బ్యాంకు కార్యకలాపాలకు సెలవు, ఆదివారం సంగతి సరే సరి. సోమవారం  గురునానక్‌ జయంతి. ఇక మంగళవారం పోలింగ్‌ రోజు ఎలాగూ సెలవు ఉంటుంది. అందుకే నగరవాసులు ఛల్‌ మోహనరంగా అంటే ఊరుకు చెక్కేసేందుకు సన్నద్ధమవుతున్నారు.  

మరోవైపు కోవిడ్‌ దృష్ట్యా సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ‘వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌’ వెసులుబాటునివ్వడంతో చాలా మంది టెకీలు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. డిసెంబర్‌ నెలాఖరు వరకు వాళ్లు ఊళ్లకే పరిమితమవుతారు. సాధారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండే టెకీలు ఈ ఎన్నికల్లో కూడా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా దూరంగానే ఉండే అవకాశం ఉంది.

మధ్యతరగతి, సాఫ్ట్‌వేర్‌ వర్గాలు తమ ఓటు హక్కును వినియోగించుకోపోవడం వల్లనే గత మున్సిపల్‌ ఎన్నికల్లో 45 శాతం  పోలింగ్‌ మాత్రమే నమోదైనట్లు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాలని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఎన్నికల నిఘా వేదిక వంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కానీ రాజకీయాల పట్ల మధ్యతరగతి ప్రజల్లో ఉండే విముఖత పోలింగ్‌ పైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. 

ఓపిగ్గా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓటేస్తారా..?
లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా సడలించడంతో జనం చాలా వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు సాధారణమయ్యాయి. 70 శాతం ప్రజలు బయట తిరుగుతుండగా 30 శాతం మాత్రమే ఇళ్లలో ఉంటున్నట్లు సమాచారం. పోలింగ్‌ రోజు సెలవు కావడం వల్ల జనమంతా ఇళ్లకే పరిమితమవుతారు. ఓపిగ్గా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓటేస్తారా..? అనేది సందేహాస్పదమే. కోవిడ్‌ దృష్ట్యా చాలామంది పోలింగ్‌ బూత్‌ల వద్ద నిరీక్షించేందుకు వెనుకంజ వేస్తే ఈ సారి కూడా పోలింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్‌ నగర అభివృద్ధి దృష్ట్యా ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. ఆ బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉత్తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.

మరిన్ని వార్తలు