ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి.. నో సెల్‌ఫోన్‌

25 Nov, 2020 03:59 IST|Sakshi

రహస్య ఓటింగ్‌కు భంగం కలగరాదు

అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశం

గతంలో కొందరు సెల్ఫీ వీడియోలు తీసుకున్న నేపథ్యంలో సర్క్యులర్‌

సాక్షి, హైదరాబాద్ ‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్ల మొబైల్‌ ఫోన్లను ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతించొద్దని ప్రిసైడింగ్‌ అధికారులను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో కొందరు ఓటర్లు ఓటేసే క్రమంలో సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టాలని పేర్కొంది. అలాగే ఓటర్లు ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోనే ఓటేసేలా చూడాలని, రహస్య ఓటింగ్‌కు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. ఎన్నికల అధికారులు, సిబ్బంది గోప్యత పాటించాలని, సమాచారాన్ని బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా సమాచారాన్ని బయటపెడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు గడువు సవరణ
పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం పోలింగ్‌ తేదీకి 4 రోజుల ముందు వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే సౌలభ్యాన్ని ఎస్‌ఈసీ కల్పించింది. గతంలో వారం ముం దు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనను ఈ మేరకు సవరించింది. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌కు 4 రోజుల ముందు బదులు 3 రోజుల ముందు వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ జారీచేసేలా సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

100 శాతం ఓటర్‌ స్లిప్పుల పంపిణీ... 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 శాతం ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. గతంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 50 శాతం మించనందున ఈసారి పోలింగ్‌కు బుధవారంలోగా ఓటర్‌ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని సూచించింది. స్లిప్పుల పంపిణీ సరిగ్గా జరిగిందా లేదా అనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది. ఈ విషయంలో అలసత్వంతో వ్యవహరించే వారిపై కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు