‘నగరంలో ఏదో జరుగబోతోందని ప్రచారం చేస్తున్నారు’

26 Nov, 2020 08:55 IST|Sakshi

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. అసత్య ప్రచారాల కారణంగా హైదరాబాద్‌లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతామని సీపీ తెలిపారు. కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకునే క్రమంలో మాటల తూటాలు పేలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయి. (చదవండి: హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర)

ఈ నేపథ్యంలో సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ ఎలక్షన్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ  హైదరాబాద్ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. ఎన్నికల ప్రచారానికి చాలా మంది వస్తున్నారు. నగరంలో ఏదో జరుగబోతోంది అన్న ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం’’ అని హెచ్చరించారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్‌ నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు