కార్లు తిరగాల్సిన రోడ్లపై పడవలు : కిషన్‌ రెడ్డి

22 Nov, 2020 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ఇప్పటికీ నెరవేర్చలేదని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఏమయ్యాయో టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లు ఇస్తారన్న నమ్మకంతోనే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారని, ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్‌ ఎప్పుడో కోల్పోయారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మారుస్తానని కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌ మునిగే పరిస్థితి ఉందని గుర్తుచేశారు. కార్లు తిరగాల్సిన రోడ్లపై పడవలు తిరిగాయాన్ని ఎద్దేవా చేశారు.  ఐదేళ్ల కాలంలో జీహెచ్‌ఎంసీని అప్పులమయంగా మార్చారని విమర్శించారు. రూ.67 లక్షల కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్‌ ఎలా నీట మునిగిందని ప్రశ్నించారు. (హైదరాబాద్ బ్రాండ్ ఏ పార్టీది కాదు: కేటీఆర్‌)

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘హైదరాబాద్‌తో బీజేపీకి విడదీయలేని బంధం ఉంది. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో కంటే ఈసారి బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. మూసీకి రక్షణ లేదు.. ప్రక్షాళన లేదు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ను వరదలో ముంచారు. బస్తీదవాఖానాలను కేంద్రమే మంజూరు చేసింది. హైదరాబాద్‌కు కేంద్రం రెండు మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసింది. మార్పుకు దుబ్బాక ప్రజలు నాంది పలికారు. మార్పు కోసం భాగ్యనగర ప్రజలు రెండో అడుగు వేయాలి’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు