ఎంఐఎం టార్గెట్‌ 50!

30 Nov, 2020 08:38 IST|Sakshi

పక్కా వ్యూహంతో ఎంఐఎం గెలుపు అంచనాలు.. 

గెలిచే అవకాశం ఉన్న చోటే గురి

అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీపై మాటల దాడి

సాక్షి, హైదరాబాద్‌ : పక్కా స్కెచ్‌తో గ్రేటర్‌ ఎన్నికల బరిలోకి దిగిన పతంగి పార్టీ.. తాను అనుకున్న సీట్లలో గెలిచి సత్తా చాటుతాననే అంచనాల్లో ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహం. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో పోటీ పడే స్థానాల మొదలు ప్రచార పర్వంలోనూ తమదైన వ్యూహాలను ఎంఐఎం నేతలు అనుసరించారు. ఈసారి మజ్లిస్‌ పోటీ చేస్తున్న డివిజన్లు 51 మాత్రమే.. అందులో కచ్చితంగా 50 గెలిచి తీరాలన్నది టార్గెట్‌.. అందుకే గెలిచేందుకు ఎక్కువ అవకాశమున్న డివిజన్లనే ఎంపిక చేసుకుని మరీ అభ్యర్థులను నిలిపింది. పక్కా ప్రణాళికతో ప్రచారం సాగించిన ఆ పార్టీ.. సదరు డివిజన్లలో గెలుపుపై లెక్కలు వేసుకుంటోంది. గతంతో పోలిస్తే ఈసారి ఎంఐఎం కాస్త భిన్నంగా వ్యవహరించింది. జనంలో తనపై ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా వ్యవహరించటంతోపాటు ప్రచారంలో మాటలను కూడా సూటిగా సంధించింది. అధికార పార్టీతో అనుకూలంగా ఉంటుందన్న ముద్ర ఆ పార్టీపై బలంగా ఉంది. అది కొంతవరకు చేటు చేస్తుందేమోనన్న సంశయంతో ఈసారి తన ప్రచారశైలితో దానికి చాన్స్‌ లేకుండా చేసింది.

టీఆర్‌ఎస్‌తో పొత్తు, అవగాహన ఏమాత్రం లేదని ప్రజలకు చెబుతూ వచ్చింది. అటు టీఆర్‌ఎస్‌ అన్నిచోట్లా పోటీ చేస్తుండటమే దీనికి నిదర్శనమనే వాదనను వినిపించింది. అక్కడితో ఆగకుండా అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్‌ఎస్‌పై మాటల దాడి చేసింది. తాము తలుచుకుంటే రెండు నెలల్లోనే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందన్న మాటలు ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి వినవచ్చాయి. అంతేకాక టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను అనుభవం లేని వ్యక్తిగా పేర్కొనడం కూడా ఇందులో భాగమేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌లు బాహాబాహీకి దిగాయి. అధికార పార్టీపై స్వయంగా ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీనే విరుచుకుపడ్డారు. ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో చివరి వరకు తీవ్రంగా పోరాడారు. ఒక్క ఓటు కూడా తన నుంచి చీలి కారు గుర్తుకు పోకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఫలితం అనుకూలంగా రాలేదు. అయినప్పటికీ, ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో దాదాపు అదే పంథాను మజ్లిస్‌ వ్యవహరించింది. తనకు పట్టున్న చోట టీఆర్‌ఎస్‌కు సందివ్వకుండా మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. 

బీజేపీ విమర్శలే తమ అస్త్రాలుగా..
గతంతో పోలిస్తే తాజా ఎన్నికల్లో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరించింది. కొద్ది రోజుల క్రితమే జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో బీజేపీ ఊపు మీద ఉంది. ఫలితాలు ఎలా వస్తాయో గానీ ప్రచారంలో మాత్రం ఆ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరించింది. దీన్ని మజ్లిస్‌ అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించింది. బీజేపీ సంధించే విమర్శలను తన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేసింది. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వాడిన ‘పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌’ను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునే ప్రయత్నం చేసింది. అసదుద్దీన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలో దీన్ని బాగా వాడుకున్నారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలంటే ‘తాము’ఏకతాటిపై ఉండాలంటూ మైనారిటీ ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పనిలోపనిగా, మైనార్టీయేతర ఓట్లు ఎక్కువగా ఉండే డివిజన్లలో బడుగు బలహీన వర్గాలకు మజ్లిస్‌ పార్టీ అండగా ఉంటుందన్న కోణంలో ప్రచారం చేశారు. ప్రధాని మోదీ నుంచి స్థానిక బీజేపీ అభ్యర్థి వరకు.. ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలను సంధించారు. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడిందని పేర్కొంటూ, ఆ పార్టీ సంప్రదాయ ఓట్లకు కూడా మజ్లిస్‌ నేతలు గాలం వేశారు. 

చక్రం తిప్పే చాన్స్‌ కోసం..  
జీహెచ్‌ఎంసీ గత కౌన్సిల్‌ టీఆర్‌ఎస్‌కు సొంతంగా 99 స్థానాలున్నాయి. దీంతో మేయర్‌ సీటును సొంతంగా ఆ పార్టీ సాధించుకుంది. కానీ అంతకుముందు కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ స్థానాలు రాకపోవటంతో మజ్లిస్‌ సాయం తీసుకుంది. దీంతో మేయర్‌ స్థానాన్ని కాంగ్రెస్‌తో కలసి మజ్లిస్‌ పంచుకుంది. ఇప్పుడు కూడా అలాంటి చాన్స్‌ వస్తే బాగుంటుందనేది ఆ పార్టీ నేతల మాటలను బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా కారణం చేత టీఆర్‌ఎస్‌కు తక్కువ సీట్లొస్తే తాను కింగ్‌మేకర్‌ కావచ్చన్నది ఆ పార్టీ నేతల భావన. అది జరగాలంటే కచ్చితంగా 50 స్థానాల్లో గెలిచి సత్తా నిరూపించుకోవాలని పార్టీ నాయకులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గౌలీపురా, ఘాన్సీబజార్, బేగంబజార్‌లలో గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈసారి ఆ రెండుచోట్లా పాగా వేయాలని మజ్లిస్‌ పట్టుదలతో ఉంది. అదెంత వరకు నెరవేరుతుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు