మూడో కన్నుతో నిఘా

27 Nov, 2020 08:34 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్‌పై నిఘా

మూడు కమిషనరేట్ల పరిధిలోని  సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ

గచ్చిబౌలిలోని కమాండ్‌  కంట్రోల్‌ నుంచి 24 గంటలు పరిశీలన

15వేల సీసీ కెమెరాలు వీక్షిస్తూ క్షేత్రస్థాయి అప్రమత్తం చేసే సౌకర్యం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలపై సైబరాబాద్‌ పోలీసులు భారీ నిఘా వేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎన్నికలు జరుగుతున్న 150 డివిజన్లలో ప్రచారం దగ్గరి నుంచి పోలింగ్‌ వరకు గచ్చిబౌలిలో ఇటీవల ప్రారంభించిన పబ్లిక్‌ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్‌ ఆపరేషన్‌ సెంటర్‌ అండ్‌ డేటా సెంటర్‌ నుంచే పరిశీలిస్తున్నారు. ఒకేసారి 15,000 సీసీటీవీ కెమెరాలు పర్యవేక్షించే సామర్థ్యమున్న ఈ సెంటర్‌ నుంచి ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వీడియో చూసి స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధంగా ఇక్కడి సిబ్బంది పనిచేస్తోంది. ప్రతిరోజూ 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌ల పద్ధతిన దాదాపు 50 మంది వరకు పనిచేస్తున్నారు. అలాగే సమస్యాతక, అతి సమస్యాతక ప్రాంతాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా వేసి క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసేలా విధులు నిర్వహిస్తున్నారు.  

  • పెట్రోలింగ్‌ చార్ట్‌లు, హాట్‌స్పాట్‌ మ్యాపింగ్, రిపీట్‌ ఇన్సిడెంట్‌ మ్యాపింగ్, టార్గెట్‌ ప్రొఫైల్‌ అనాలసిస్, సస్పెక్ట్‌ అనాలాసిస్, ఛేంజ్‌ ఓవర్‌ టైమ్‌ మ్యాపింగ్‌ వివరాలు ఉండడంతో ఆయా ప్రాంతాలపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు.  
  • ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే వెంటనే అక్కడికి క్షణాల వ్యవధిలోనే పెట్రోలింగ్‌ వాహనం వెళ్లేలా చూస్తున్నారు.  
  • ఎన్నికల్లో భాగంగా ఏవైనా ఘర్షణలు జరిగినా, కొట్లాటలు జరిగినా సంబంధిత ఫొటోలు, వీడియోలు ఈ సెంటర్‌ ద్వారానే నిమిషాల వ్యవధిలో సేకరించనున్నారు.  అలాగే ఆయా సీసీటీవీలకు చిక్కిన నిందితుల ఫేషియల్‌ రికగ్నేషన్‌ చేసి ట్రాకింగ్‌ చేస్తారు. 
  • ఇలా ఈ సెంటర్‌ ఆయా ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లే లోపు పూర్తి సమాచారాన్ని తెలుసుకుని అప్‌డేట్‌ చేస్తారు.  

 ప్రస్తుతం ఇవీ అనుసంధానమైనవి..

  • 10,000 ప్రభుత్వ కెమెరాలు 
  • 126 కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లు (ఠాణాలవి) 
  • ఒక లక్ష–కమ్యూనిటీ అండ్‌ ఇతర ఏజెన్సీ సీసీటీవీ ఇంటిగ్రేషన్‌ 
  • 2828 జంక్షన్లు 
  • 38 ఫేషియల్‌ రికగ్నేషన్‌ కెమెరాలు 1322–జీపీఎస్‌–ఎనబ్లెడ్, కనెక్టెడ్‌ పెట్రోల్‌ వెహికల్స్‌ 

శాంతిభద్రతలకు ఎంతో ఉపయోగం
‘దేశంలోనే మొదటిదైన ఈ సెంటర్‌ను రెండు అంతస్తుల్లో నిర్మించారు. రియల్‌ టైమ్‌ మానిటరింగ్, డయల్‌ 100కు సంబంధించి ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టైమ్, హాక్‌ ఐ యాప్‌ సేవలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో, వార్‌రూమ్, డాటా సెంటర్‌ తొలి అంతస్తులో ఉంది. ఒకే సమయంలో 15 వేల సీసీటీవీ కెమెరాలు మానిటర్‌ చేసేలా భారీ స్క్రీన్‌ల సకల సౌకర్యాలు ఉన్నాయి. శాంతిభద్రతలు, ట్రాఫిక్, అత్యవసర సేవలు ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చు.ముఖ్యంగా ఇది ఫీల్డ్‌ ఆఫీసర్లకు ఉపయోగపడనుంది. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎప్పటికప్పుడూ మానిటరింగ్‌ చేసేందుకు ఈ సెంటర్‌ ఎంతో ఉపయోగపడనుంది. ఎక్కడేమి జరిగినా క్షేత్రస్థాయి సిబ్బందిని నిమిషాల వ్యవధిలో అప్రమత్తం చేసే వీలుంది’ అని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు