వారికి మీరే ప్రేరణ, థ్యాంక్స్‌ : కేటీఆర్‌

1 Dec, 2020 13:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోరాహోరీగా జరుగుతున్న గ్రేటర్‌ ఎన్నికల పోరులో పేలవమైన పోలింగ్‌ శాతం నిరాశపరుస్తున్న తరుణంలో పెద్దవాళ్లు శ్రమకోర్చి మరీ ఓటు వేస్తున్న సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌పై నగర వాసుల ఆసక్తి అంతంత మాత్రంగానే ఉండగా వికలాంగులు, వయోవృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు.  ముఖ్యంగా 80 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు పద్మశ్రీ ట్విటర్‌లో వెల్లడించారు. తన  అమ్మమ్మకు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు లాక్‌డౌన్‌ తరువాత తొలిసారి గడప దాటి బయటకు వచ్చిందని పేర్కొన్నారు. ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటూ దీన్ని మంత్రి  కేటీఆర్‌కు ట్యాగ్‌ చేయగా, ఆయన స్పందించారు. అమ్మమ్మకు చాలా థ్యాంక్స్‌ అంటూ రిప్లై ఇచ్చారు. ఫిర్యాదులు తప్ప  బయటకు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించని వారందరికీ ఆమె స్ఫూర్తిదాయకమని ట్వీట్‌ చేశారు.

కరోనాకారణంగా గత 3 నెలలుగా కదల్లేకుండా ఉన్నప్పటికీ, రవీందర్ (చీఫ్ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్) అమీర్‌పేట పోలింగ్‌ కేంద్రానికి వీల్ చైర్‌లో వచ్చి మరీ ఓటు వేశారు. మరో సంఘటనలో తన తండ్రి, హృద్రోగి. నడవలేని స్థితిలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. మీపనితనాన్ని చూసిన  మా అత్తగారు తన జీవితంలో తొలిసారి ఓటువేశారంటూ ఇంకొకరు ట్వీట్‌ చేయడం విశేషం. అటు భార్యతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం చాలా తక్కువగా నమోదవుతోంది. ఓటర్లు లేక పోలింగ్‌ కేంద్రాలు బోసి పోయి కనిపిస్తున్నాయి.  దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారిక లెక్కలప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్‌ శాతం 18.20 శాతం మాత్రమే. మరోవైపు  గ్రేటర్‌ మేయర్ పీఠంపై కన్నేసిన టీఆర్‌ఎస్‌, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.  దొంగ ఓట్లు వేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ రిగ్గింగ్‌కు పాల‍్పడుతోందని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  దీంతో పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు గుర్తులు తారుమారుకావడంతో ఓల్డ్‌ మలక్‌పేటలో పోలింగ్‌ రద్దయింది.  ఓల్డ్‌ మలక్‌పేట 69వ డివిజన్‌లో డిసెంబరు 3న రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించింది.

మరిన్ని వార్తలు