ఎన్నికల్లో పోటీ చేయాలంటే..

19 Nov, 2020 11:57 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి కొన్ని నిబంధనలున్నాయి. జీహెచ్‌ఎంసీ చట్టం, తదితర నిబంధనల మేరకు ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యుర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు ఇలా ఉన్నాయి. చదవండి: గెలుపే ధ్యేయం.. వ్యూహ ప్రతివ్యూహాలతో బరిలోకి!
– సాక్షి, సిటీబ్యూరో

 పోటీచేసే అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాలుండాలి. నామినేషన్‌ పరిశీలన తేదీనాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 
  జీహెచ్‌ఎంసీలో ఒక వార్డులో ఓటరుగా ఉన్న వ్యక్తి 150 వార్డుల్లో ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చు. కానీ ప్రతిపాదకుడు మాత్రం పోటీ చేసే వార్డులో ఓటరుగా ఉండాలి.  
 పోటీ చేసే వ్యక్తి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. 
 ముగ్గురు పిల్లలు కలిగి ఉండి వారిలో ఒకరిని దత్తతకు వేరే వారికి ఇచ్చినా పోటీ చేయడానికి అర్హత ఉండదు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించరు.  
 ఒక వ్యక్తి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలను కలిగి, భార్య మరణిస్తే, మళ్లీ పెళ్లిచేసుకొని రెండో భార్య ద్వారా ఇంకొక సంతానం పొందినా పోటీ చేయడానికి వీల్లేదు. అతని ద్వారా కలిగిన సంతానం ముగ్గురు కనుక అనర్హుడవుతారు. అతని రెండో భార్య మాత్రం పోటీ చేయవచ్చు. ఎందుకంటే ఆమెకు అదే మొదటి సంతానం కనుక.  
 ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలుండి, వారిలో ఒకరు నామినేషన్‌ పరిశీలనకు ముందు మరణిస్తే, పోటీ చేసేందుకు అర్హుడవుతారు. జీవించి ఉన్న సంతానాన్నే పరిగణనలోకి తీసుకుంటారని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి.  

 నామినేషన్‌ పరిశీలన రోజుకి ఇద్దరు పిల్లలు కలిగిన మహిళ, మళ్లీ గర్భవతి అయినప్పటికీ పోటీ చేయవచ్చు. అప్పటికి ఆమెకు ఉన్నది ఇద్దరు పిల్లలే కనుక అవకాశం ఉంది.  
  ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగి అయి ఉండి ఎన్నికల్లో పోటీ చేయాలంటే, నామినేషన్‌ పరిశీలన రోజుకు అతను చేసిన ఉద్యోగ రాజీనామాను సంబంధిత అధీకృత అధికారి ఆమోదించి ఉండాలి. లేని పక్షంలో పోటీకి అర్హులు కారు.  
  రేషన్‌షాప్‌ డీలర్‌ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. గతంలో ఇలాంటి ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని అర్హులుగా పరిగణిస్తున్నారు.  
  అంగన్‌వాడీ వర్కర్లు మాత్రం పోటీ చేయడానికి అర్హులు కాదు. హైకోర్టు తీర్పు మేరకు ఈ నిబంధన అమల్లో ఉంది.  
 ఒక వార్డులో ఒక అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి.. అదేవార్డు నుంచి తానుకూడా పోటీ చేయవచ్చు. చట్టపరంగా ఎలాంటి అభ్యంతరాల్లేవు.  
  నామినేషన్‌ దాఖలు సమయంలో రిటర్నింగ్‌ అధికారి గదిలోకి అభ్యర్థి లేదా ప్రతిపాదకునితో పాటు ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు. 

  నామినేషన్‌ పరిశీలన సమయంలో ఎవరైనా అభ్యర్థి సంతకం చేసి ఉండకపోతే రిటర్నింగ్‌ అధికారి దాన్ని లోపభూయిష్టమైనదిగా గుర్తించి, తిరస్కరించవచ్చు. ఒకసారి నామినేషన్‌ సమర్పించిన తర్వాత అభ్యర్థి తిరిగి దానిపై సంతకం చేసేందుకు అనుమతించరు.  
 ఫారం–ఎను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు లేదా రిటర్నింగ్‌ అధికారికి డైరెక్ట్‌గా నామినేషన్లు సమర్పించే  చివరి రోజు మధ్యాçహ్నం 3 గంటలలోపు అందజేయాలి. ఫారం–బిని సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి, ఉపసంహరణ గడువు రోజున మధ్యాహ్నం 3 గంటలలోగా అందజేయాలి. 
  ఇతర సమాచారం కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లోనూ చూడవచ్చనని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.  

 జీహెచ్‌ఎంసీలో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే అనర్హులవుతారు. అయితే 31–05–1995 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చు. అయితే అలాంటి వారు  31–05–1995 తర్వాత ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి వారు జీవించి ఉన్నట్లయితే పోటీకి అనర్హులవుతారు. 
 ఎవరైనా విశ్వసనీయ హోదాలో కాక జీహెచ్‌ఎంసీకి గత సంవత్సరం వరకు, నోటీసు ఇచ్చిన తర్వాత మూడు నెలల్లో జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంలో విఫలమైతే పోటీచేయడానికి అర్హత ఉండదు. అయితే నామినేషన్‌ పరిశీలన తేదీనాటికి బకాయిలన్నీ చెల్లించి రసీదు చూపితే పోటీ చేసేందుకు అర్హత లభి
స్తుంది.  
 ఒకేవ్యక్తి ఒక వార్డులో పోటీచేసేందుకు గరిష్టంగా నాలుగు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అయితే చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాలో మాత్రం అభ్యర్థి పేరును ఒకసారి మాత్రమే నమోదు చేస్తారు.  

మరిన్ని వార్తలు