ఆ ఓట్లను లెక్కించండి: హై కోర్టు

8 Dec, 2020 08:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపునకు అడ్డంకి తొలగింది. బ్యాలెట్‌ పేపర్‌పై స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇతర గుర్తులు ఉన్న బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపుపై అభ్యంతరాలున్న వారు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి సోమవారం తీర్పునిచ్చారు. స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర నిరి్ధష్టమైన గుర్తులు ఉన్నా వాటిని లెక్కించేందుకు అనుమతిస్తూ ఈ నెల 3న ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఇన్‌చార్జీ అంథోనిరెడ్డితోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సోమవారం విచారించారు. స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను లెక్కించడానికి వీల్లేదని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏ గుర్తు ఉన్నా వాటిని లెక్కించాలంటూ ఎన్నికల కమిషన్‌ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. 

నేరెడ్‌మెట్‌ డివిజన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో స్వస్తిక్‌ గుర్తుకు బదులుగా సిబ్బంది పోలింగ్‌ కేంద్రాన్ని తెలిపే గుర్తును ఇచ్చారని, కొంతసేపటి తర్వాత ఈ తప్పును గుర్తించి సరిచేశారని ఎన్నికల కమిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ వాదనలు వినిపించారు. అప్పటికే మరో గుర్తుతో ఓట్లు పడిన విషయాన్ని పోలింగ్‌ సిబ్బంది తెలియజేయడంతో ఆ ఓట్లను కూడా లెక్కించాలని 3వ తేదీ సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో మొత్తం 25,136 ఓట్లకు గాను, 24,612 ఓట్లను లెక్కించామని, ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను మాత్రం లెక్కించకుండా పక్కనపెట్టామని పేర్కొన్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ 504 ఓట్ల మెజారిటీలో ఉందని, బూత్‌ నంబర్‌ 50లో ఎన్నికల సిబ్బంది పొరపాటు కారణంగా ఓటర్ల మనోగతం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించేందుకు అనుమతి ఇచ్చామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని వివరించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. (చదవండి: ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం)

ఈ నెల 9న ఓట్ల లెక్కింపు...
నేరేడ్‌మెట్‌: నేరేడ్‌మెట్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎన్నికపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు కోర్టు తీర్పుతో తెరపడింది. ఈ నెల 9న నేరేడ్‌మెట్‌లోని భవన్స్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ రిసెప్షన్‌ సెంటర్‌ (డీఆర్‌సీ)లో 544 ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు మల్కాజిగిరి ఉప ఎన్నికల అధికారి దశరథ్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు