బల్దియా పోరు; అభ్యర్థులూ తస్మాత్‌ జాగ్రత్త! 

18 Nov, 2020 08:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర పోలీసులు అలర్ట్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ..ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధికారులను బాధ్యులుగా నియమించారు. ప్రధాన కమిషనరేట్‌లో ప్రత్యేక ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు  కమిషనర్‌ (స్పెషల్‌ బ్రాంచ్‌) తరుణ్‌ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్‌ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్‌ఆర్‌ (డెయిలీ సిట్యువేషన్‌ రిపోర్ట్‌) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్‌పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్‌ ఇన్‌చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్‌ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. బందోబస్తు సంబంధిత చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: అధికారుల కొరడా

ఎలక్షన్‌ సెల్‌ రెడీ!
‘గ్రేటర్‌’ ఎన్నికల సైరన్‌ మోగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో భాగంగా నగరంలోని పరిస్థితులు బేరీజు వేడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కమిషనరేట్‌లో ప్రత్యేక ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటైంది. నగర సంయుక్త పోలీసు  కమిషనర్‌ (స్పెషల్‌ బ్రాంచ్‌) తరుణ్‌ జోషి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. శాంతిభద్రతల విభాగం అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌ సైతం ఇందులో కీలక భూమిక పోషిస్తారు. కోడ్‌ అమలులో ఉన్న రోజుల్లో ప్రతిరోజూ ఓ డీఎస్‌ఆర్‌ (డెయిలీ సిట్యువేషన్‌ రిపోర్ట్‌) తయారు చేసి నివేదించాల్సిన బాధ్యత ఈ సెల్‌పై ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్‌ ఇన్‌చార్జిలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను చౌహాన్‌ నిర్వహిస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల నామినేషన్లు పర్వం మొదలుకుని వచ్చే నెల్లో ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగం కొనసాగుతుంది. ఎన్నికల బందోబస్తుకు  అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వహిస్తారు. చదవండి: ‘గ్రేటర్‌’ వార్‌ 1న

► నగరంలోని అయిదు జోన్లలో ఎన్నికల విధి నిర్వహణ, అవసరమై బలగాల కేటాయింపు, వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలను ఏర్పాటు చేయడం తదితర విధులు కూడా ఎన్నికల సెల్‌ నిర్వహిస్తుంది. డీజీపీ కార్యాలయంతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఏర్పాటైన ఎలక్షన్‌ సెల్‌కు సంబంధించిన హాట్‌లైన్‌ దీనికి అనుసంధానించి ఉంటాయి.  

► జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎన్నికల విధులకు సంబంధించిన పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం ఈ సెల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలు, ప్రవర్తన నియమావళి తదితరాలకు సంబంధించి కొత్వాల్‌ అంజనీకుమార్‌ అన్ని స్థాయిన అధికారులను సమాయత్తం చేస్తున్నారు. దీనికోసం ఆయన మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరాయ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.  
►ఇందులో గత ఎన్నికల్లో జరిగిన ఉదంతాలు, ఆ కేసుల స్థితిగతులు, ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలను చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలోని లైసెన్డ్‌ ఆయుధాలు కలిగి ఉన్న వారంతా వాటిని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.  
►స్థానిక పోలీసుస్టేషన్లు లేదా అధీకృత ఆయుధ డీలర్ల దగ్గర డిపాజిట్‌ చేయాలి. కౌంటింగ్‌ తదితర ప్రక్రియలు పూర్తయ్యాక మాత్రమే తమ ఆయుధాలను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం సైతం ఊపందుకోనుంది. ఈ ప్రక్రియలో భాగంగా సభలు, ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహించాలని భావించే రాజకీయ పార్టీలు, వ్యక్తులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 
► కోవిడ్‌ నేపథ్యంలో బహిరంగ సభల్ని ఎస్‌ఈసీ నిషేధించింది. మిగిలినవీ పరిమిత సంఖ్యలో, కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరగనున్నాయి. దీనికోసం ఆయా అభ్యర్థులు, పార్టీలు సంబంధిత జోనల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ)లకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుని ఈ అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి అనువుగా నిర్ణీత గడువుకు ముందే డీసీపీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  
►రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం ఏర్పాటు చేసే సంచార వాహనాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం 
ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. 

సైబరాబాద్‌.. రాచకొండ పరిధిలోనూ..  
బల్దియా ఎన్నికలకు నగారా మోగడంతో సైబరాబాద్, రాచకొండ పోలీసులు భద్రతా విధుల్లో తలమునకలయ్యారు. ఆయా కమిషనరేట్లలో ఉన్న 66 డివిజన్లలో అభ్యర్థుల నామినేషన్‌ దగ్గరి నుంచి ఎన్నికల కౌంటింగ్‌ వరకు దాదాపు 14,500 మందికిపైగా పోలీసు సిబ్బంది సేవలను వినియోగించనున్నారు. సైబరాబాద్‌లో 38 డివిజన్‌లు, రాచకొండలో 28 డివిజన్‌లు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లతో ఇటు నగదు, అటు మద్యం సరఫరాపై ప్రధానంగా నిఘా వేసి ఉంచుతామని ఇరు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు మహేష్‌ భగవత్, వీసీ సజ్జనార్‌ తెలిపారు.

పక్కా ప్రణాళికతో ముందుకు..  
ఎన్నికల వంటి కీలక ఘట్టాల్లో ఎంత పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామో.. అంత సజావుగా ఆ ఘట్టాలను పూర్తి చేసి విజయం సాధించగలం. సిటీ పోలీసులకు ఎన్నికల నిర్వహణలో మంచి అనుభవం ఉంది. 2018, 2019ల్లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్ని సజావుగా పూర్తి చేసి ఈసీ మన్ననలు పొందాం. మరోసారి నాటి విధివిధానాలను మననం చేసుకోవాలి. సమకాలీన అవసరాలకు తగ్గట్టు మార్పు చేర్పులతో కొత్త పంథాలో ముందుకు వెళ్లాలి. 
పోలీసు అధికారులతో కొత్వాల్‌ అంజనీకుమార్‌ 

కోడ్‌ కూసింది
గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఇక కొత్త పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్‌ కానున్నాయి. ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్న పనుల్ని మాత్రం యధాతథంగా కొనసాగించనున్నారు. అధికార పార్టీతోపాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలితే ఎన్నికల కమిషన్‌ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులూ తస్మాత్‌ జాగ్రత్త!

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు