ఈవీఎంలా.. బ్యాలెటా?

19 Sep, 2020 06:37 IST|Sakshi
అధికారులతో సమావేశమైన పార్థసారథి

బల్దియా ఎన్నికల నిర్వహణకు ఏది ఉత్తమం? 

సాక్షి, హైదరాబాద్‌: నాలుగైదు నెలల్లో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కోవిడ్‌ నేపథ్యంలో ఈవీఎంలను వినియోగించాలా? బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించాలా? అనే అంశంపై  అధికారులు యోచిస్తున్నారు. దీంతోపాటు  సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆన్‌లైన్‌ను ఎక్కువగా వినియోగించుకోవాలని,  ప్రజల్లో అవగాహన పెంచి, పోలింగ్‌ శాతం పెరిగేందుకు కృషి చేయాలని భావిస్తున్నారు. నూతనంగా ఎంపికైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి శుక్రవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత,  కోవిడ్‌ నేపథ్యంలో దురయ్యే సవాళ్లు,  తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ,  ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహించాల్సిన వివిధ పనుల గురించి జోనల్‌ నుంచి సర్కిల్‌ స్థాయి అధికారులకు శిక్షణ నిచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌పై ఎన్నికల విధుల్లోని వారు తగిన అవగాహన కలిగి ఉండాలని, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌  సిబ్బ ంది ర్యాండమైజేషన్‌ తదితర అంశాలు తెలిసి ఉండాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేందుకు, పోలింగ్‌ ప్రక్రియ త్వరితంగా జరిగేందుకు టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు.  

ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు సీజీజీ సహకారంతో ఫేస్‌ రికగ్నిషన్, తదితరమైనవి  వినియోగించుకోవాలన్నారు.గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగిందని, ఈసారి పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఇంటెన్సివ్‌ ఓటర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించారు. ఇందుకు ఎన్జీఓలు, రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఇతర పౌరసేవల సహకారం తీసుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా ఎన్నికల సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని,  ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. కోవిడ్‌ కారణంగా ఈవీఎంలా.. లేక బ్యాలెట్లా అన్నదానిపై చాలాసేపు  చర్చించారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ, కార్యాచరణకు సంబంధించి అక్టోబర్‌ రెండో వారంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో అడిషనల్‌ సీఈఓ జ్యోతి బుద్ధప్రకాశ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు