‘గ్రేటర్‌’ ఎన్నికలు; 7న ముసాయిదా జాబితాలు

3 Nov, 2020 08:17 IST|Sakshi

ఓటర్ల జాబితాల్లో తమ పేర్లున్నాయో లేదో సరిచూసుకోవాలి

నోటిఫికేషన్‌ వెలువడే దాకా పేర్లు చేర్చే అవకాశాలు

కరోనా నేపథ్యంలో విశాల గదులున్న భవనాల్లోనే పోలింగ్‌ కేంద్రాలు

ఓటరుకు అందుబాటులో కి.మీ. పరిధిలోనే పోలింగ్‌ స్టేషన్‌

జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందికి ఎస్‌ఈసీ ఆదేశాలు

13న ఓటర్ల తుది జాబితాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా, మొత్తం 150 డివిజన్ల (వార్డుల) వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 7న ముసాయిదా జాబితాలు ప్రచురిస్తారు. మిగతా ప్రక్రియలను ముగించి 13న తుది ఓటర్ల జాబితాలను ప్రచురించనున్న నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించే ఓటర్ల జాబితాల్లో ఏ ఓటరు కులం లేదా మతం వెల్లడించే విధంగా వివరాలు ఉండకూడదని జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆదేశాలిచ్చింది. వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాల్లో ఏవైనా క్లరికల్‌ లేదా ప్రచురణ దోషాలుంటే.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు మొదట అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఆ విధమైన లోపాలను సరిచేసి, ఆ తర్వాత వార్డు ఓటరు జాబితాల్లో సరిచేయాలని సూచించింది. ఈ విధంగా చేయడం ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లోని వివరాలకు అనుగుణంగానే వార్డుల వారీ జాబితాలు ఉంటాయని స్పష్టం చేసింది. 

హార్డ్, సాఫ్ట్‌ కాపీలు.. 
వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు ఈసీ వద్ద నమోదై రిజర్వ్‌ చిహ్నం కేటాయించిన రాజకీయ పార్టీలకు ఉచితంగా సరఫరా చేసి వాటి నుంచి రశీదులు పొందాలని మున్సిపల్‌ అధికారులకు ఎస్‌ఈసీ సూచిం చింది. ఈ జాబితాల కాపీలు ఇతరులు కావాలని కోరిన పక్షంలో దానికయ్యే వాస్తవ ధర వసూలు చేసి హార్డ్, సాఫ్ట్‌ కాపీలు అందజేయొచ్చునని తెలిపింది. అవసరమైన ఓటరు జాబితా కాపీల ముద్రణకు అనుగుణంగా ముందుగానే అంచనా వేసి ప్రింట్‌ చేసుకోవాలని సూచించింది. వార్డుల వారీ ఓటర్ల జాబితాలను ఫొటోలు లేకుండా జీహెచ్‌ఎంసీ, ఎస్‌ఈసీ వెబ్‌పోర్టళ్లలో ఉంచాలని తెలిపింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కీలకమైనందున వివిధ అంశాలకు సంబంధించి ఎస్‌ఈసీ స్పష్టతనిచ్చింది. (చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం)

కరోనా నేపథ్యంలో విశాల గదుల్లోనే  
కరోనా నేపథ్యంలో విశాలమైన గదులు, హాళ్లు ఉన్న భవనాలల్లోనే పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు..  సాధ్యమైన మేర ఓటేసేవారు ఒక ద్వారం నుంచి ప్రవేశించి మరో ద్వారం గుండా బయటకు వెళ్లగలిగే హాళ్లు, గదులున్న భవనాలనే పోలింగ్‌ స్టేషన్లుగా ఎంపిక చేయాలి. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్‌ స్టేషన్‌ కేటాయించాలి. ఆయా వార్డుల పరిధిలోనే సంబంధిత పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేయాలి. ఓటర్‌కు అందు బాటులో ఉండేలా ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం లేకుండా పోలింగ్‌ కేంద్రాలు కేటాయించాలి. పోలింగ్‌ కేంద్రాలుగా పాఠశాల భవనాలను ఎంపిక చేస్తే ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటినే ఎంపిక చేయాలి. ళీ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతేనే చివరి ప్రయత్నంగా పోలింగ్‌ కేంద్రా లను తాత్కాలిక నిర్మాణాల్లో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థల భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దు. పోలీస్‌ స్టేషన్లు, ఆసుపత్రులు, మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను ఎంపిక చేయొద్దు. భవనాల కింది అంతస్తుల్లోనే పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలి. 7న ముసాయిదా ఓటర్ల జాబితాల తయారీ మొదలై 13న తుది జాబితాలను ప్రచురించనున్నందున.. అర్హులైన ఓటర్లు అసెంబ్లీ జాబితాల్లో తమ పేర్లను సరిచూసుకోవాలి. ళీ పేర్లు లేకుంటే తమ ఓటు నమోదుకు ఎన్‌వీఎస్‌పీ.ఇన్‌ పోర్టల్‌ ద్వారా నమోదు పత్రం లేదా నిర్దేశిత ఫారం– 6లో అసెంబ్లీ ఓటర్ల రిజిస్ట్రేషన్‌ అధికారి వద్ద దరఖాస్తు పత్రం సమర్పించాలి. వాటిని పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను ముందుగా అసెంబ్లీ జాబితాల్లో చేర్చి తదనుగుణంగా సంబంధిత వార్డు ఓటరు జాబితాల్లో చేరుస్తారు. ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసే తేదీ వరకు ఈ అవకాశముంటుంది.

మరిన్ని వార్తలు