బిడ్డా.. నువ్వు గెలవాలి: కేకే 

20 Nov, 2020 10:27 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్ ‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి మరోసారి తన కూతురు విజయదుందుభి మోగించాలని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు కూతురు గద్వాల్‌ విజయలక్ష్మికి నామినేషన్‌ పత్రాలు అందించి ఆశీర్వదించారు. గురువారం ఉదయం ఆమె నామినేషన్‌ వేసేకంటే ముందు తన తండ్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. 2016 ఎన్నికల్లో కూడా ఆమె నామినేషన్‌ వేసే ముందు తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సెంటిమెంట్‌గా ఈ సారి కూడా తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. తన తండ్రే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా విజయలక్ష్మి పేర్కొన్నారు. చదవండి: గ్రేటర్‌ ఎన్నికలు: నేను.. నా నేర చరిత!

డమ్మీ నామినేషన్‌.. చాన్స్‌మిస్‌
కూకట్‌పల్లి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మమ్మీ అనూహ్యంగా టికెట్‌ దక్కించుకొని విజయం సాధించింది. ఈసారి కూడా డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయాలనుకున్న ఆమెకు.. కూతురుకు కూడా నిరాశే ఎదురైంది. వివేకానందనగర్‌ కాలనీ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ లక్ష్మీబాయి గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అప్పడు అనుకున్న అభ్యర్థి ఆమె కూతురు మాధవరం స్వాతితో కలిసి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం వద్దకు చేరుకుంది. స్వాతి పేరు ఓటర్‌ లిస్టులో లేకపోవటంతో టిక్కెట్‌ తిరస్కరణకు గురైంది. దీంతో ఆమెతో పాటే వచ్చిన స్వాతి తల్లి మొలుగు లక్ష్మీబాయి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసింది. ప్రత్యర్థి మాధవరం రంగారావు సతీమణి రోజాపై గెలుపొందింది. ఈసారి స్వాతి నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకొని టికెట్‌ కోసం ఎదురుచూస్తోంది. మళ్లీ లక్ష్మీబాయి డమ్మీ నామినేషన్‌ వేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈసారి స్వాతికి టికెట్‌ దక్కలేదు. చదవండి: ఒంటరి పోరుకు సిద్ధమైన మజ్లిస్‌..

అక్కా.. నీ ఆశీస్సులు కావాలి 
వెంకటేశ్వరకాలనీ: అక్కా... నీ అండ కావాలంటూ వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె కవిత గురువారం టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ కార్పొరేటర్‌ భారతి నాయక్‌ను కోరారు. బుజ్జగింపు పర్వంలో భాగంగా ఆమె ఉదయమే భారతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో సమావేశమై తన గెలుపునకు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు భారతి ఆనందం వ్యక్తం చేస్తూ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కవిత గెలుపును తన గెలుపుగా తీసుకుంటానన్నారు. 

యంగ్‌.. తరంగ్‌... 
బంజారాహిల్స్‌: ఎన్నికల్లో యువత పోటీ చేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందని నేటి యువకులు భావిస్తున్నారు. రాజకీయాల్లోకి యువత రావడం ద్వారా అవినీతిని అంతమొందించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో తామే పోటీ చేసి గెలిచి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్‌ డివిజన్‌ బీజేపీ టికెట్‌ ఆశిస్తూ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ విద్యార్థి మోరంగంటి సాయికృష్ణారెడ్డి(24) నామినేషన్‌ వేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో తాను బరిలోకి దిగుతున్నానని ఆయన వెల్లడించారు. సోమాజిగూడ డివిజన్‌ నుంచి టీడీపీని టికెట్‌ను ఆశిస్తూ బిలావర్‌ హరిత(25) అనే ఎంబీఏ విద్యార్థిని నామినేషన్‌ దాఖలు చేశారు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్షతో బరిలోకి దిగినట్లు ఆమె స్పష్టం చేశారు.

కన్నీటి పర్యంతమైన మాజీ కార్పొరేటర్‌
వెంకటేశ్వరకాలనీ: ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూసిన మాజీ కార్పొరేటర్‌ బి.భారతికి నిరాశే ఎదురైంది. పనితీరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ మన్ననలు అందుకున్న సిట్టింగ్‌ కార్పొరేటర్‌ మన్నె కవిత అభ్యర్థిత్వంవైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో భారతికి టిక్కెట్‌ దక్కలేదు. బుజ్జగింపు పర్వంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్, అభ్యర్థి మన్నె కవిత, ఇన్‌చార్జి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లు భారతి ఇంటికి చేరుకొని ఆమెను బుజ్జగించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తమ నేత దానం నాగేందర్‌ ఎలా చెబితే అలా నడుచుకుంటామని, కవితకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా భారతి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు