బల్దియా పోరు: గెలుపు గుర్రాల కోసం భారీ కసరత్తు..

20 Nov, 2020 08:44 IST|Sakshi

నామినేషన్ల పర్వానికి నేడు తెర 

ఇప్పటి వరకు 537మంది.. 597 నామినేషన్లు

చివరి రోజు భారీగా దాఖలుకు అవకాశం

ఇక మిగిలింది స్క్రూటినీ.. 

తప్పని రెబెల్స్‌ బెడద

ఇక ప్రచారంపై అన్ని పార్టీల దృష్టి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొదటి అంకమూ,కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం ముగియనుంది. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేయని వారందరూ వేయనుండటంతో చివరి రోజు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీల నుంచే కాకుండా ఇండిపెండెంట్లు సైతం భారీగా నామినేషన్లు వేయనున్నారు. పార్టీలు ప్రకటించిన జాబితాల్లో పేర్లు లేనివారు సైతం నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో ఆయా పార్టీల్లో చివరికి ఏం జరగనుందన్న ఉత్కంఠ నెలకొంది. ఒక పార్టీలో టికెట్‌ రాకపోతే మరో పార్టీనుంచి పొందేందుకు సిద్ధమైన వారు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ఈనేపథ్యంలో శుక్రవారం ఆసక్తికర దృశ్యాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారినామినేషన్లకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇవ్వడం, ఊహించని విధంగా తక్కువ వ్యవధిలో పోలింగ్‌ తేదీ ప్రకటన వెలువడటంతోనేతలంతా హడావుడిలో మునిగారు. టీఆర్‌ఎస్‌లో కంటే ఇతర పార్టీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు సమయం ఉండటంతో చాలామందిలో ఆందోళన నెలకొంది.  

సాక్షి, హైదరాబాద్‌ : బల్దియా ఎన్నికల్లో గట్టెక్కేందుకు గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పక్షాలు భారీ కసరత్తు చేశాయి. పార్టీ శ్రేణులు టికెట్‌ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్‌ పార్టీల్లో టికెట్ల కేటాయింపుపై చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వివిధ ఆరోపణలున్న సిట్టింగ్‌లను మళ్లీ బరిలో దింపే విషయంలో అని పార్టీలూ తర్జనభర్జన పడ్డాయి. చివరి క్షణం వరకు సమర్థుల కోసం వేచి చూశాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు కొనసాగింది.  నోటిఫికేషన్‌ విడుదలైన రోజే 105 మందితో తొలి జాబితా ప్రకటించి సగానికి పైగా సిట్టింగ్‌లకు అవకాశం కల్పించింది. చదవండి: అల రాజకీయ ప్రయాణంలో..

గురువారం మధ్యాహ్నానికి రెండో జాబితాలో 20 మందికి సీట్లు ఇచ్చారు. మిగిలిన 25 డివిజన్ల కోసం మాత్రం రాత్రి వరకు కసరత్తు చేసింది. కొంత మంది సిట్టింగ్‌లకు సైతం మొండిచేయి చూపించింది. ముఖ్యంగా బల్దియా పీఠం చేజారకుండా ఒక వైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీని అడ్డుకునేందుకు  సమర్ధులైన సిట్టింగ్‌లతోపాటు మెరికల్లాంటి కొత్త ముఖాలను మాత్రమే బరిలో దింపింది. మజ్లిస్‌ పార్టీతో దోస్తీ ఉన్నప్పటికీ రాజీ పడకుండా పాతబస్తీ స్థానాల్లో సైతం అభ్యర్థులను పోటీకి పెట్టింది. సాక్షాత్తు మంత్రి కేటీఆర్‌ ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఈసారి కనీసం పది స్థానాల్లో మజ్లిస్‌ను ఓడించి తమ ఖాతాలో వేసుకుంటామని ప్రకటించడం పోటీ తీవ్రతను బహిర్గత పరుస్తోంది.  చదవండి: ఎలాంటి తెలంగాణ కావాలో తేల్చుకోండి

వ్యూహాత్మకంగా బీజేపీ 
బల్దియా పీఠం కోసం బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించింది. ప్రతి డివిజన్‌ను సీరియస్‌గా తీసుకొని అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. పార్టీలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి వలసలు సాగుతున్నప్పటికీ కొత్తవారికి అవకాశం ఇవ్వకుండా పార్టీని నమ్ముకున్న వారిలోనే సమర్థులు, మెరికల్లాంటి వారిని ఎంపిక కోసం రోజంతా కసరత్తు చేసింది. నోటిఫికేషన్‌ జారీ అయిన రోజే 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ మిగిలిన డివిజన్‌ల అభ్యర్థిత్వాల కోసం రోజంతా దరఖాస్తులను వడబోసి రాత్రి పదకొండు గంటల వరకు 52 మంది అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది.  చివరకు పార్టీ టికెట్ల కోసం ఆశావాహులు ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేసింది. చివరకు అందరూ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చారు. 

కాంగ్రెస్‌..సీరియస్‌ 
కాంగ్రెస్‌ పార్టీ బల్దియా ఎన్నికలను సీరియస్‌గా తీసుకొని అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. గాంధీభవన్‌లో ఎంపిక కోసం రోజంతా ఆశావహుల దరఖాస్తుల్ని వడబోసి సమర్ధతను పరిశీలించి ఆచితూచి నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్నింటా సమర్ధతను పరిశీలించింది. మొదటి రోజే రెండు విడతలుగా 45 మందితో కూడిన జాబితాను ఖరారు చేయగా, గురువారం మొత్తం 36 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గెలుపు గుర్రాల కోసం చివరి క్షణం వరకు ప్రయత్నించే «ధోరణి కాంగ్రెస్‌లో వ్యక్తమైంది. 

మజ్లిస్‌..సిట్టింగ్‌లు సైతం ఔట్‌ 
పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్‌ కొందరు సిట్టింగ్‌లను సైతం పక్కకు పెట్టింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉన్న స్థానాలు చేజారకుండా జనంలో మంచి పేరులేని సిట్టింగ్‌ల స్థానంలో అభ్యర్థిత్వాలను మార్చివేసింది. అధికారికంగా జాబితా ప్రకటించనప్పటికీ మెజార్టీ సిట్టింగ్‌లతో పాటు కొత్తవారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పార్టీ పోటీతో మైనార్టీ ఓట్లు చీలి కమలనాథులు గట్టెక్కకుండా బలమైన స్థానాల్లోనే పోటీ చేసేలా ప్రణాళిక రూపొందించింది.    

అధికార టీఆర్‌ఎస్‌లోనూ ఇక ప్రచార పర్వం..
నామినేషన్ల అంకం పూర్తయ్యాక ప్రచారానికి మిగిలింది వారం రోజులే కావడంతో ఉరుకులు, పరుగులు తప్పని పరిస్థితి. ప్రచారంలోనూ వ్యూహ ప్రతివ్యూహాలు, లోపాయికారీ ఒప్పందాలు, ఇతరత్రా కార్యక్రమాలు ముమ్మరం కానున్నాయి. అన్ని పార్టీల్లోనూ హేమాహేమీల ప్రచార యాత్రలూ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల్లోనూ, స్వతంత్రులూ సర్వసన్నాహకాల్లో మునిగారు. ఓట్ల వేట కోసం ఇంటింటి ప్రచారాలు, సోషల్‌మీడియా వేదికగానే కాక ఇతరత్రా మార్గాలూ యోచిస్తున్నారు. ప్రచారాన్ని కొత్తపుంతలు తొక్కించాలని భావిస్తున్నవారితోపాటు గుంభనంగా చేయాలని భావిస్తున్నవారూ ఉన్నారు. ఇక అధికార పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే ఆయుధంగా చేసుకోనుండగా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.  

రెండో రోజు 608 నామినేషన్లు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల రెండోరోజైన గురువారం 522 మంది అభ్యర్థులు 608 నామినేషన్లను దాఖలు చేశారు. మంచి రోజు కావడంతో ఎక్కువమంది నామినేషన్లు దాఖలు చేశారు.  దీంతో ఇప్పటి వరకు మొత్తం  537 మంది అభ్యర్థులు 628 నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుంచి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఎం నుండి నలుగురు, కాంగ్రెస్‌ నుండి 68 మంది, ఎంఐఎం నుండి 27 మంది, టీఆర్‌ఎస్‌ నుండి 195 మంది, టీడీపీ నుండి 47 మంది, వైఎస్సార్‌సీపీ నుండి ఒకరు, గుర్తింపు పొందిన పొలిటికల్‌ పార్టీల నుండి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు.  

మరిన్ని వార్తలు