గ్రేటర్‌ పోరుకు సిద్ధం కండి

1 Nov, 2020 01:46 IST|Sakshi

ప్రక్రియ మొదలుపెట్టాలంటూ ఎన్నికల కమిషనర్‌కు మున్సిపల్‌ శాఖ విజ్ఞప్తి

కొత్తగా వార్డుల పునర్‌వ్యవస్థీకరణ లేదా డీలిమిటేషన్‌ లేదు

ఓటర్ల జాబితా ప్రచురణకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు రంగం సిద్ధ మైంది. డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. వచ్చే ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుండటంతో ఆలోగా ఎన్నికలు నిర్వహిం చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాల్సిం దిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ని కలిసి మున్సిపల్‌ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. కొత్తగా వార్డుల పునర్‌వ్యవస్థీకరణ లేదని, గతంలోని వార్డులే కొనసాగడంతో పాటు 2016 ఎన్నికల్లో అనుసరిం చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లే వచ్చే ఎన్నికల్లోనే కొనసాగించేందుకు సంబంధించిన రెండు జీవోలను కూడా ఎస్‌ఈసీకి అందజేశారు. అంటే రెండోటర్మ్‌ కూడా అవే రిజర్వేషన్లు కొన సాగేలా ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్టసవరణ బిల్లుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పాలకమండలి ఐదేళ్ల పదవీకాలానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే సౌలభ్యం జీహెచ్‌ఎంసీ చట్టంలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఈ మేరకు ఎస్‌ఈసీ కార్యా లయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థ సారథితో అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిష నర్‌ లోకేశ్‌కుమార్, అధికారులు భేటీ అయ్యారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించి, ప్రచురించడానికి నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ముందు, ఇప్పటి నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసేవరకు యావత్‌ జీహెచ్‌ఎంసీ యంత్రాంగాన్ని ఎన్నికల పనులపై దృష్టి కేంద్రీ కరించేలా చూడాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఎన్నికల కమిషనర్‌ సూచించారు. ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు వార్డులవారీగా ఓటర్ల జాబితాను డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్లు రూపొందించేలా చూడాలని ఆదేశించారు. 

ఓటర్ల తుది జాబితాపై నోటిఫికేషన్‌...
జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 13న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తుది ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా (క్వాలిఫైంగ్‌ డేట్‌) తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను తు.చ తప్పకుండా పాటిస్తూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసే బాధ్యతను సంబంధిత మున్సిపల్‌ సర్కిళ్లలోని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు. శాసనసభ ఓటర్ల జాబితాని యథాతథంగా పాటిస్తూ అదే ఫార్మాట్‌లో జీహెచ్‌ఎంసీలోని అన్ని వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ వార్డు వారీగా మున్సిపల్‌ ఓటర్ల జాబితా టైటిల్‌ పేజీలో పోలింగ్‌ ఏరియాల వివరాలను పొందుపరచాలని సూచించారు. నవంబర్‌ 13న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే దాకా చేర్పులు, తొలగింపులు లేదా కరెక్షన్లు వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఈఆర్‌వోల నుంచి సంబంధిత డిప్యూటీ కమిషనర్లు స్వీకరించి, ఆ మేరకు సంబంధిత వార్డులోని ఓటర్ల జాబితాల్లో చేర్చాలని ఈ నోటిఫికేషన్‌లో పార్థసారథి పేర్కొన్నారు.

5న కలెక్టర్లతో పార్థసారథి సమావేశం
జీహెచ్‌ఎంసీ వార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండటంతో ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతపై ఆయా జిల్లాల కలెక్టర్లతో నవంబర్‌ 5న ఎన్నికల కమిషనర్‌ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 150 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్‌ అధికారులను ఎస్‌ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆర్‌వోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చే ‘ట్రైనింగ్‌ టు ట్రైనర్స్‌’(టీవోటీ)కు నవంబర్‌ 3, 4 తేదీల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ఇదీ...

  • నవంబర్‌ 7న వార్డుల వారీగా ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలను తయారుచేసి, సాధారణ ప్రజలు పరిశీలించేందుకు వీలుగా రూల్‌నెం.5లో పేర్కొన్న ప్రదేశాల్లో ప్రదర్శించాలి.
  • 8వ తేదీనుంచి 11 వరకు వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరణ. 
  • 9న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి సమావేశం.
  • 10న జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిప్యూటీ కమిషనర్ల సమావేశం.
  • 12న ఏవైనా అభ్యంతరాలుంటే డిప్యూటీ కమిషనర్ల ద్వారా పరిష్కారం.
  • 13న సంబంధిత సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్ల ద్వారా వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాల తుది ప్రచురణ.
మరిన్ని వార్తలు