కోట్లు మింగుతున్న గుంతలు.. అయినా కనిపించని ప్రయోజనం

23 Jul, 2021 22:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ ఫ్లై ఓవర్లు, కేబుల్‌ బ్రిడ్జిలు తదితరమైనవెన్నో నిర్మిస్తున్న బల్దియా రోడ్లపై గుంతలు(పాట్‌హోల్స్‌) సమస్యలను మాత్రం పరిష్కరించలేకపోతోంది. పాట్‌హోల్స్‌ సమస్యలు లేకుండా ఉండేందుకు రోడ్ల నిర్మాణంలో బలంగా ఉండే పాలిమర్‌ మోడిఫైడ్‌  బిటుమన్‌(పీఎంబీ), క్రంబ్‌ రబ్బర్‌ బిటుమన్‌(సీఆర్‌ఎంబీ) వాడుతున్నా ఒక్క వానకే చిల్లులు పడుతున్న రోడ్లపై ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. పాట్‌హోల్స్‌ లేకుండా చేసేందుకు జీహెచ్‌ఎంసీకి ఎంతకాలం కావాలంటూ ఇటీవలే æహైకోర్టు సైతం ప్రశి్నంచింది. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లకంటే భారీ కంపెనీల ప్రైవేట్‌ ఏజెన్సీల పర్యవేక్షణతో సమస్యలుండవని భావించి వాటికి కాంట్రాక్టులు ఇచ్చినా రోడ్ల సమస్యలు తీరలేదు. బల్దియా ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, సాంకేతికత వినియోగించినా, రీ కార్పెటింగ్‌ చేస్తున్నా సమస్యల పరిష్కారానికి మోక్షం లభించడం లేదు.  

ఖర్చవుతున్నా.. కనిపించని ప్రయోజనం 
రోడ్లను జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదనుకుంటే పొరపాటే. బల్దియా బడ్జెట్‌లో దాదాపు 16 శాతం రోడ్ల కోసమే కేటాయిస్తున్నారు. 2020–21 ఆరి్థక సంవత్సరమైతే, బల్దియా ఎన్నికల వల్లనో, మరో కారణమో కానీ ప్రతి సంవత్సరం కంటే రెట్టింపు నిధులు ఖర్చు చేశారు. మొత్తం రూ.1,126 కోట్లు రోడ్లపై కుమ్మరించారు. అయినా ప్రజల సమస్యలు తీరలేదు. రోడ్ల నిర్మాణాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు, పాట్‌హోల్స్‌ పూడ్చివేతలకు.. ఇలా వివిధ అంశాల పేరిట నిధులు రోడ్లపాలవుతున్నాయే తప్ప జనం ఇబ్బందులు తీరడం లేదు. గడచిన నాలుగైదు సంవత్సరాలుగా జీహెచ్‌ఎంసీ చేసిన వ్యయం వివరాలను చూస్తే.. సమగ్ర రోడ్డు నిర్వహణ పేరిట ప్రధాన రహదారుల మార్గాల్లోని 709 కి.మీ.ల మేర రోడ్లను ఐదేళ్లపాటు కాంట్రాక్టును పెద్ద ఏజెన్సీలకు ఇచ్చారు. మార్గాలు ఎప్పుడూ సాఫీ ప్రయాణానికి అనుకూలంగా ఉండాలనేదే కాంట్రాక్టు ఒప్పందంలోని ప్రధానాంశం. కానీ వీటి దారుల్లో సైతం 11వేలకు పైగా గుంతలు పూడ్చినట్లు పేర్కొన్నారు.  

ప్రివెంటివ్‌ పీరియాడికల్‌ మెయింటెనెన్స్‌ పేరిట.. 
► మనుషులు హెల్త్‌ చెకప్‌ చేయించుకుంటే వ్యాధి లక్షణాలు తొలిదశలోనే గుర్తించి, వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకున్నట్లు.. రోడ్లను కూడా పూర్తిగా దెబ్బతిన్నాక వేయడం కంటే ముందే నిర్ణీత వ్యవధుల్లో మరమ్మతులు చేస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయని 2018–19లో పీరియాడికల్‌ ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌(పీపీఎం) పేరిట మరమ్మతులు చేశారు. పీఎంబీ, సీఆర్‌ఎంబీ రోడ్లు వేసేందుకు మొత్తం 119 పనులకు రూ.712 .86 కోట్లు ఖర్చు చేశారు.  
►రోడ్ల నాణ్యత బాగుండేందుకు నిర్వహణలు, కొత్త రోడ్ల పేరిట ఐదేళ్లలో మరో 11,897 పనుల పేరిట రూ.2,520.32 కోట్లు ఖర్చు చేశారు. 
►ఇక ట్రాన్స్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, బీజీఎల్‌ తదితర సంస్థలు వాటి అవసరాల కోసం రోడ్ల తవ్వకాలు జరపడం, వర్షాలకు ధ్వంసం కావడం వంటి కారణాలతో ఏర్పడ్డ పాట్‌హోల్స్‌ పూడ్చేందుకు ఐదేళ్లలో రూ.26.75 కోట్లు ఖర్చయింది. మొత్తం 2,43,455 పాట్‌హోల్స్‌ పూడ్చివేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.  
► వర్షాకాలంలో నిల్వనీటిని వెంటనే తోడిపోయడం, రోడ్లు మరమ్మతులు చేయడం వంటి వాటికోసం మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీమ్స్‌(ఎంఈటీ), ఇన్‌స్టంట్‌ రిపేర్‌ టీమ్స్‌ పేరిట ప్రత్యేక టీమ్స్‌ ఏర్పాటు, సామగ్రి తదితరమైన వాటి కోసం నాలుగేళ్లలో రూ.144.05 కోట్లు ఖర్చు చేశారు. పాట్‌హోల్స్‌ మాత్రమే కాకుండా పెద్దసైజు ప్యాచ్‌వర్క్‌లు తదితరమైనవి సత్వరం చేసేందుకని జెట్‌ ప్యాచర్స్‌ మెషిన్లను ఏటా దాదాపు రూ.15 కోట్ల అద్దెతో తీసుకున్నారు. అలా గడచిన మూడేళ్లలో దాదాపు రూ.45 కోట్లు చెల్లించారు. ఇలా వివిధ పనుల పేరిట నాలుగైదేళ్లలో దాదాపు రూ.4 వేల కోట్లయితే ఖర్చయింది కానీ, సమస్య మాత్రం తీరలేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు