ఈసారైనా పట్టాలెక్కేనా?

27 Jul, 2020 07:22 IST|Sakshi
చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి వద్ద వాహనాల రద్దీ (ఫైల్‌)

మళ్లీ తెరపైకి మలక్‌పేట ఆర్‌యూబీ అంశం 

రూ. 18.14 కోట్లు ఇస్తానన్న జీహెచ్‌ఎంసీ 

హెచ్‌ఆర్‌డీసీఎల్‌ కింద పనులు చేపట్టాలనే యోచన 

గతంలో మాదిరిగా కాకూడదంటున్న నగరవాసులు

 సాక్షి, సిటీబ్యూరో: సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనల రూపంలో పెండింగ్‌లో ఉండిపోయిన మలక్‌పేట రైల్‌ అండర్‌ బ్రిడ్జ్‌కి (ఆర్‌యూబీ) మోక్షం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) కింద మరికొన్న పనులతో పాటు దీన్నీ చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. దీనికోసం రూ. 18.14 కోట్లు కేటాయించడానికి సిద్ధమైంది. అయితే గతంలో మాదిరిగా ఇది ప్రతిపాదనల స్థాయిలోనే అటకెక్కకూడదని నగర వాసులు కోరుతున్నారు. సాధారణ రోజుల్లో ఓ స్థాయిలో, వర్షం కురిస్తే తీవ్రంగా ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని సృష్టిస్తున్న ఈ ప్రాంతంలో సమస్యలు తీరాలంటే ఆర్‌యూబీతో పాటు నాలాపై రోడ్డు నిర్మాణం కావాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులు చెప్తున్నారు.  

ఈ రూట్‌ ఎంతో ఇంపార్టెంట్‌... 
నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్‌సుఖ్‌నగర్‌–చాదర్‌ఘాట్‌ మధ్యలోనిది ఒకటి. ఈ మార్గంలో అంతర్గత వాహనాలే కాకుండా అంతరాష్ట్ర, అంతర్‌ జిల్లాలవీ నడుస్తుంటాయి. మలక్‌పేట రైల్వేస్టేషన్‌ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్‌ నెక్, వాటర్‌ లాగింగ్‌ ఏరియా కలిసి ఈ రూట్‌లో తిరిగే వాహన చోదకులకు తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్‌ వైపు మెట్రో రైల్‌ స్టేషన్‌ కూడా రావడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలుబారులు తీరుతున్నాయి. అంతర్‌ జిల్లా ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండగల సీజన్‌లో నరకం చవిచూడాల్సిందే.  

నాలుగేళ్ల క్రితం నుంచీ... 
ప్రస్తుతం మలక్‌పేట రైల్‌ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్‌ వైపు, మరోటి మలక్‌పేట వైపు వెళ్లే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. ఇవి రద్దీకి పట్టుకోలేకపోవడంతో మూడో మార్గం అందుబాటులోకి తీసుకురావాలని 2016లో తొలిసారిగా నిర్ణయించారు. ఇది అందుబాటులోకి వస్తే ఆ రూట్లను డైనమిక్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్‌ లైన్‌ ట్రాఫిక్‌ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావించారు. అంటే ఈ మార్గాలను పూర్తి స్థాయిలో వన్‌ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆర్‌యూబీతో పాటు మలక్‌పేట వైపు నాలాపై రోడ్డు సైతం నిర్మించాల్సి ఉంది. అప్పుడే పూర్తి ఉపయోగం ఉంటుందని ట్రాఫిక్‌ పోలీసులు చెప్తున్నారు. 

రెండుసార్లు ప్రతిపాదనల వద్దే... 
మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్‌ పాస్‌ ఏర్పాటుకు సహకరించడానికి 2018లో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ముందుకు వచ్చింది. ఈ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన రైల్వే శాఖ ప్రారంభించడానికి ముందే రూ. 10 కోట్లు డిపాజిట్‌ చేయాలని షరతు పెట్టింది. ఈ మొత్తం చెల్లించేందుకు హెచ్‌ఎంఆర్‌ ముందుకు వచ్చింది. ఆ తర్వాత గత ఏడాది ఓ సందర్భంలో ఈ ‘మూడో మార్గం’ ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ ముందుకు వచ్చింది. అయితే అదీ ప్రతిపాదన స్థాయిలోనే ఆగిపోయంది. ఇటీవల నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇక ఇప్పట్లో ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి రావడం అసాధ్యమని అందరూ భావించారు. అయితే గ్రేటర్‌ వ్యాప్తంగా అనేక ఆర్‌యూబీలు, ఫ్లై ఓవర్లు, మార్గాల అభివృద్ధి చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఈ ఆర్‌యూబీకి రూ. 18.14 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో ఈ సారైనా ఇది అమలులోకి రావాలని, ప్రతిపాదనల స్థాయిలోనే ఆగిపోకూడదని నగరవాసులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు