బీఆర్‌ఎస్‌: లాగిన్‌ ఐడీ మార్చుకోవచ్చు

12 Nov, 2020 08:38 IST|Sakshi

ఫోన్‌ నంబర్‌ మారినా ఏం ఫర్వాలేదు.. 

యజమానుల బదులు మధ్యవర్తుల నంబర్‌ ఉన్నా.. 

వెసులుబాటు కల్పించిన జీహెచ్‌ఎంసీ  

టోల్‌ఫ్రీ నంబర్‌ 040  21 11 11 11

ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సంప్రదించవచ్చు. 

సాక్షి, హైదరాబాద్‌: భవనాల క్రమబద్దీకరణ కోసం దాదాపు అయిదేళ్ల క్రితం  దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది లాగిన్‌ ఐడీగా తమ ఫోన్‌ నంబర్‌ ఇవ్వలేదు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల్ని సమర్పించాల్సి ఉండటంతో అది తెలియక కొందరు.. ఇతరత్రా పొరపాట్లు దొర్లుతాయేమోనని కొందరు మధ్యవర్తులను ఆశ్రయించారు. వీరిలో ఆర్కిటెక్టులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు.  చాలామంది మధ్యవర్తులు ప్రజల నుంచి డబ్బు గుంజే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ దరఖాస్తులో యజమానుల ఫోన్‌ నంబర్లకు బదులు తమ ఫోన్‌ నంబర్లనే ఉంచారు. దీంతో జీహెచ్‌ఎంసీ నుంచి ఏ సమాచారం వెళ్లినా వారికే తెలుస్తోంది. దీన్ని ఆసరా చేసుకొని, అవసరానికనుగుణంగా ఎక్కువ వసూళ్లు చేయాలనుకున్నవారు వీరిలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 

  • ఇటీవల బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఏవైనా షార్ట్‌ఫాల్స్‌ ఉంటే వాటిని జత చేయాల్సిందిగా యజమానులకు సమాచారం పంపుతున్నారు.  
  • వీరిలో చాలామంది ఫోన్‌నంబర్లు యజమానులవి కాకపోవడంతో మధ్యవర్తులు దీన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. యజమానుల ఫోన్‌నంబర్లే ఇచి్చన వారిలోనూ చాలామంది ఫోన్‌నంబర్లు మారాయి. కొందరివి డీయాక్టివేట్‌ అయ్యాయి.  కొందరు యజమానులకు ఫోన్‌ నంబర్లు ఉంచిన మధ్యవర్తులకు నడుమ కాంటాక్ట్‌ లేకుండా పోయింది.  
  • కొందరు మధ్యవర్తులు నగరంలో లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నుంచి దరఖాస్తులోని ఫోన్‌ నంబర్లకు సమాచారం పంపితే వెళ్లడం లేదు.  
  • మధ్యవర్తుల ఫోన్‌ నంబర్లు ఉంటే వారికే సమాచారం వెళ్తుంది. అది యజమానులకు తెలియడం లేదు. దీంతో సకాలంలో జతచేయాల్సిన షార్ట్‌ఫాల్స్‌ సంబంధిత డాక్యుమెంట్లు జతచేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో పాటు వారి దరఖాస్తు స్టేటస్‌ను కూడా తెలుసుకోవడం కుదరడం లేదు.  
  • పలువురు యజమానులు ఈ పరిస్థితిని వివరిస్తూ తమ అప్లికేషన్‌లో తమ ఫోన్‌నంబర్‌ను, లేదా మారిన కొత్త నంబర్‌ను ఉంచేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. పరిస్థితిని గ్రహించిన జీహెచ్‌ఎంసీ ఇందుకు అవకాశం కలి్పంచింది. ఫోన్‌ నంబర్‌ మార్చుకోవాలనుకున్నా, అసలైన యజమానులే తమ ఫోన్‌ నంబర్‌ను చేర్చాలనుకున్నా, మారిన కొత్త నంబర్‌ను నమోదు చేయాలనుకున్నా ఆన్‌లైన్‌ ద్వారా అవకాశం కలి్పంచింది.   
  • ఇందుకు తగినవిధంగా సంబంధిత అప్లికేషన్‌ను అప్‌డేట్‌ చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో రిజి్రస్టేషన్‌ చేసుకోవడం ద్వారా అడిగిన ప్రాథమిక సమాచారం నమోదు చేసి తమ ఫోన్‌ నంబర్‌ను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తద్వారా నిజమైన యజమానులు తమ నంబర్‌ను చేర్చుకోవచ్చు.  
  • పాత నంబర్‌ మారితే దాన్ని నమోదు చేయవచ్చు. ఈ సందర్భంగా ఆధార్‌ నంబర్‌ను కూడా జత చేయాల్సి ఉంటుంది. నిజమైన యజమానిగా ధ్రువీకరించుకునేందుకు  ఇప్పుడు ఆధార్‌ను కూడా చేర్చారు. సంబంధిత అధికారులు పరిశీలించి, దరఖాస్తు చేసుకున్నది దరఖాస్తుదారే (యజమానే)  అని ధ్రువీకరించుకున్నాక ఓకే చేస్తే వారి కొత్త  ఫోన్‌ నంబర్‌ నమోదవుతుంది. అది లాగిన్‌ ఐడీగా పనిచేస్తుంది.
మరిన్ని వార్తలు