అంతా ఆ తాను ముక్కలే!

28 Mar, 2022 20:58 IST|Sakshi

ఏఎంఓహెచ్‌ల డిప్యుటేషన్ల వ్యవహారం

సీఎస్‌ రంగంలోకి దిగాకే చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: ఎంతోకాలంగా తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన.. డిప్యుటేషన్లపై జీహెచ్‌ఎంసీకి వచ్చి,దాదాపుగా మెడలు పట్టి గెంటినంత పరిస్థితి వచ్చేంత దాకా సహాయ వైద్యాధికారులు (ఏఎంఓహెచ్‌లు) మాతృసంస్థలకు వెళ్లకపోవడంలో పలువురు అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడమేనని తెలుస్తోంది. డిప్యుటేషన్లకు సంబంధించి అవగాహన ఉన్నవారు తెలిపిన వివరాల మేరకు, డిప్యుటేషన్‌ ముగిసినా వెళ్లకపోవడంలో ప్రధాన పాత్రధారులు ఏఎంఓహెచ్‌లే కాగా.. వారు కొనసాగేందుకు పరోక్షంగా సహకరించిన సంబంధిత అధికారులు సైతం బాధ్యులేనని తెలుస్తోంది.  

► జీహెచ్‌ఎంసీకి వేరే ప్రభుత్వ విభాగం నుంచి డిప్యుటేషన్‌ మీద పనిచేసేందుకు రావడానికి సంబంధిత అధికారి విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు అంగీకరించాలి. అందుకనుగుణంగా అధికారి మాతృసంస్థ   ఉన్నతాధికారులు డిప్యుటేషన్‌పై పంపేందుకు అంగీకరిస్తారు. ఆ మేరకు ప్రభుత్వం అనుమతిస్తుంది.  

► తొలుత ఏడాది కాలానికని వచ్చేవీరు విజ్ఞప్తి చేసుకుంటే.. వీరి పనితీరు నచ్చితే మరో ఏడు పొడిగించేందుకు  జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు అంగీకరిస్తారు.అలా ప్రతియేటా పొడిగింపుతో  మూడేళ్ల వరకు కొనసాగే అవకాశముంది. ఆ తర్వాత సైతం కొనసాగాలనుకుంటే.. జీహెచ్‌ఎంసీ అంగీకరించడంతోపాటు సంబంధిత అధికారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవాలి. ఆమోదిస్తే ఐదేళ్ల వరకు కొనసాగవచ్చు. ఆ తర్వాత  ఉండేందుకు వీల్లేదు.  

► ఇలా.. ఒక్కో ఏడాది ముగియగానే నిబంధనలకనుగుణంగా పొడిగింపు లేని పక్షంలో జీహెచ్‌ఎంసీలోని వారి పైఅధికారి, పరిపాలన విభాగం,  వారికి వేతనాలు చెల్లించే విభాగం, అకౌంట్స్‌ విభాగం గాని గడువు ముగియడానికి ముందస్తుగానే ఆ విషయాన్ని తెలియజేయాలి. నిబంధనలు పాటించనిపక్షంలో వేతనం చెల్లించకుండా తగు చర్యలు తీసుకోవాలి. లేదా మాతృసంస్థకు సరెండర్‌ చేయాలి. కానీ.. జీహెచ్‌ఎంసీలో దాదాపు గత అయిదేళ్లుగా  ఈ పద్ధతిని పాటించిన దాఖలాల్లేవు.  

ప్రశ్నించిన సీఎస్‌? 
► ఎప్పుడైతే విస్తృతాధికారాలను జోన్లకు అప్పగించారో, ప్రధాన కార్యాలయం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. సంబంధిత అధికారులకు ఈ విషయాల గురించి తగిన అవగాహన లేదో, లేక మనకెందుకులే అని మిన్నకున్నారో, లేక ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయో తెలియదు గాని అయిదేళ్లు దాటాక కొనసాగుతున్న వారు సైతం ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఉండేవారో తెలియదు గాని.. వారిలో కొందరి అవినీతి పెచ్చరిల్లి బట్టబయలు కావడం... ఒకరిపై ఏకంగా పోలీసు కేసు సైతం నమోదైన నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిని డిప్యుటేషన్‌ గడువు ముగిసినా ఎందుకు కొనసాగిస్తున్నారని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ప్రశ్నించినట్లు  తెలిసింది.

మరిన్ని వార్తలు