విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్‌’ సిటీ పరిస్థితి ఏంటి?

7 Sep, 2022 13:15 IST|Sakshi

బెంగళూరు వరద అనుభవాలు గుర్తించాల్సిందే

అక్కడ నీరు ఇంకే దారి లేకపోవడం..

కాంక్రీట్‌ మహారణ్యం విస్తరణే కారణం

కుంభవృష్టితో విలవిలలాడిన ఐటీ సిటీ

నీటమునిగిన పలు ప్రాంతాలు

రూ.200 కోట్లకు పైగా నష్టం

మన గ్రేటర్‌లోనూ ఎన్నో ముంపు కష్టాలు

నివారణపై దీర్ఘకాలిక చర్యలు శూన్యం

ఏటా మునుగుతున్న గ్రేటర్‌ సిటీ 

సాక్షి, హైదరాబాద్‌: కుండపోత వర్షాలు, వరదలతో మన పొరుగునే ఉన్న ఐటీ సిటీ బెంగళూరు విలవిల్లాడుతోంది. సుమారు 1700 కంపెనీలు కొలువుదీరిన ఐటీ హబ్‌ సహా ఔటర్‌ పరిసరాలు.. 50కి పైగా ప్రాంతాలు వరద తాకిడితో అతలాకుతలమయ్యాయి. దాదాపు రూ.200 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఇదే తరుణంలో ఐటీలో శరవేగంగా విస్తరిస్తున్న మన గ్రేటర్‌ సిటీలోనూ 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 20 సెంటీమీటర్ల వర్షం కురిస్తే చిగురుటాకులా వణికిపోతోంది. సుమారు 200కుపైగా ప్రాంతాలు నీటమునుగుతున్నాయి.

ముంపు, వరద సమస్యల నివారణకు మన మహానగరంలోనూ దీర్ఘకాలిక చర్యలు చేపట్టడంలో సర్కారు విఫలమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా విస్తరణకు నోచుకోని నాలాలు, వర్షపునీరు ఇంకే దారి లేకపోవడం, కాంక్రీట్‌ జంగిల్‌ విస్తరణ, చెరువులు, కుంటలు కబ్జాకు గురవడం తదితర కారణాలు బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 


బెంగళూరు తాజా దుస్థితి ఇదీ.. 

► వర్షపునీరు ఇంకే దారి లేకుండా విస్తరించిన కాంక్రీట్‌ మహారణ్యం బెంగళూరు సిటీ కొంపముంచింది.  రహదారులు, వాటికి సమాంతరంగా ఉండే కల్వర్టుల వ్యవస్థలో లోపాలు కూడా తాజా వరదలకు కారణమేనని చెబుతున్నారు. ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న మహాదేవపుర, బొమ్మనహళ్లి తదితర ప్రాంతాల్లో 260 మురుగు నీటి కాల్వల ఆక్రమణలు అతిపెద్ద సమస్యగా మారాయి. ఈ ప్రాంతాల్లో వందలాది ఆక్రమణలను బృహత్‌ బెంగళూరు మహా నగర పాలక అధికారులు గుర్తించారు.   

► ఇక ఓఆర్‌ఆర్‌ ప్రాంతంతోపాటు నగరంలోనూ మౌలిక సదుపాయాల ఏర్పాటులో శాఖల మధ్య సమన్వయం లేకపోవడం శాపంగా పరిణమించింది. నగరంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత లేకపోవడం వరద ముప్పును మరింత పెంచింది. మురుగు నీటి కాల్వల విస్తరణ పనులను రూ.1500 కోట్ల అంచ నా వ్యయంతో ప్రారంభించినప్పటికీ.. ఈ పనుల్లో 20 శాతం కూడా పూర్తికాకపోవడం గమనార్హం. బెంగళూరు వరదల నుంచి గ్రేటర్‌ సిటీ పాఠాలు నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  


హైదరాబాద్‌లో వరద, ముంపు కష్టాల నివారణకు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలివీ.. 

► సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మహానగరంలో 185 చెరువులు, 1500 కిలోమీటర్ల మేర నాలా వ్యవస్థ ఉంది.  
► 900 కిలోమీటర్ల మేర నాలా వ్యవస్థ నగరంలోని ముఖ్య ప్రాంతాల్లోనూ, మిగతా 600 కి.మీ శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉంది.  
► నాలాలపై అనధికారికంగా సుమారు పదివేల అక్రమ నిర్మాణాలు వెలసినట్లు బల్దియా అంచనా. వీటిని తక్షణం తొలగించాలి.   
► నాలాల ప్రక్షాళన, విస్తరణకు సుమారు పదివేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బల్దియా గతంలో సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళిక అమలు చేయాలి.   
► చెరువులు, కుంటల ఆక్రమణలను నిరోధించాలి. ప్రతి ఇల్లు, కార్యాలయం, పరిశ్రమలో ఇంకుడు గుంతను తప్పనిసరి చేయాలి. 
► లోతట్టు ప్రాంతాల్లో భారీ పరిమాణంలో ఉండే ఇంకుడు కొలనులు ఏర్పాటు చేయాలి. 
► గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో వెలువడుతోన్న మురుగునీరు ఓపెన్‌ డ్రెయిన్లు,నాలాల్లో యథేచ్ఛగా కలిసి మూసీలోకి ప్రవేశిస్తోంది. వర్షం కురిసినపుడు ప్రధాన రహదారులపై పోటెత్తుతోంది. 
► నగర శివార్లలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైన మాస్టర్‌ప్లాన్‌ అమలుకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి.  


హైదరాబాద్‌ నగరంలో మళ్లీ భారీ వర్షం  

ఉత్తర– దక్షిణ ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్యన కురిసిన జడివానకు పలు ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వరద నీరు పోటెత్తింది. ట్రాఫిక్‌ ఎక్కడికక్కడే స్తంభించింది. వరదనీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. వాహనదారులు, ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.

అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, గాజులరామారం తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అత్యధికంగా గాజుల రామారంలో సాయంత్రం 6 గంటల వరకు 6.9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పలు చోట్ల రెండు నుంచి 5 సెంటీమీటర్ల మేర వరకు వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు