అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్‌ నిషేధం నై

5 Jun, 2022 07:38 IST|Sakshi

1 జూన్‌ 2018. జీహెచ్‌ఎంసీలో  సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను 2022 లోగా పూర్తిగా నిషేధిస్తామని 2018లో పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అప్పటి యూఎన్‌ఈపీ(యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎరిక్‌సోలెంతో కలిసి ఆమేరకు ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారుల కోసం ఆరు ఎలక్ట్రిక్‌ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. 4 జూన్‌ 2022. నిజంగానే గ్రేటర్‌లో ప్లాస్టిక్‌ నిషేధం.. ఈపాటికి సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ సంపూర్ణ నిషేధం అమలవుతాయనుకున్న వారి అంచనాలు తప్పాయి. ఏదీ జరగలేదు. నిర్ణీత మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ నిషేధం అమలు కాలేదు. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ సంపూర్ణ నిషేధం సాధ్యం కాలేదు. ప్రారంభించిన ఎలక్ట్రిక్‌ కార్లు ఏమయ్యాయో తెలియదు. 

సాక్షి, హైదరాబాద్‌: నాలుగేళ్లు గడిచిపోయినా నాలుగడుగులు కూడా ముందుకు పడలేదు. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి, అనంతరం కమిషనర్‌గా పనిచేసిన  దానకిశోర్‌ అమలు చర్యలు ప్రారంభించి, కొంతకాలం అమలు చేసినప్పటికీ, అనంతరం పూర్తిగా కనుమరుగైంది. చిరువ్యాపారులు, మాంసం దుకాణాల వారు సైతం చాలావరకు ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన పొంది అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ, తదుపరి అధికారుల అశ్రద్ధతో ఆ కార్యక్రమం కుంటుపడింది. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం. 

ఆమోదం సై.. అమలు నై 
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత మార్చిలో మరోసారి సింగిల్‌ యూజ్‌  ప్లాస్టిక్‌ నిషేధానికి, 75 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల నిషేధానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. అందుకు  స్టాండింగ్‌ కమిటీ సైతం  ఆమోదం తెలిపింది. కానీ, దానికి సంబంధించి  ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు గత సంవత్సరమే ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు పట్టించుకోలేదు.  

ఏళ్ల తరబడి.. 
జీహెచ్‌ఎంసీలో దాదాపు దశాబ్దం క్రితమే ప్లాస్టిక్‌ నిషేధచర్యలు ప్రారంభమైనప్పటికీ, రాజకీయ నేతల జోక్యం.. ప్లాస్టిక్‌ ఉత్పత్తిదారుల ప్రభావంతో ముందుకు సాగలేదు.జనార్దన్‌రెడ్డి, దానకిశోర్‌లు కమిషనర్లుగా వ్యవహరించే  సమయంలో కొంతమేర అమలు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయారు.అప్పటి నిబంధనల కనుగుణంగా 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం అమలయ్యేలా తగిన చర్యలు చేపట్టారు.  

నాలాల్లోనూ ప్లాస్టికే.. 
జీహెచ్‌ఎంసీలో రోజుకు సగటున ఆరున్నరవేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిల్లో దాదాపు600  మెట్రిక్‌ టన్నులు ప్లాస్టిక్‌ వ్యర్థాలే.నాలాల్లోని వ్యర్థాల్లో 40 శాతానికి పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలే.  నాలాల్లో వరదనీరు సాఫీగా సాగకుండా ముంపు సమస్యలకు ఇదీ ఓ ముఖ్య కారణమేనని ఇంజినీర్లు పేర్కొన్నారు. నగరంలో ఏటా 73 కోట్ల ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులు వినియోగిస్తున్నట్లు ఒక అంచనా. ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అవుతోంది. ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్‌నశించేందుకు 500 సంవత్సరాలకు పైగా పడుతుందని నిపుణులు పేర్కొన్నారు.  

పెనాల్టీల కోసమేనా..? 
ప్లాస్టిక్‌ నిషేధంపై జీహెచ్‌ఎంసీ కొద్దిరోజులు హడావుడి చేయడం.. చిరువ్యాపారులపై పెనాల్టీలు విధించడం.. అనంతరం మరిచిపోవడం పరిపాటిగా మారింది.  ఏళ్ల తరబడి ఇదే తంతు. దీని వల్ల అటు వ్యాపారులు, ఇటు ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేరు. వారికి డబ్బులు అవసరమైనప్పుడు పెనాల్టీల పేరిట వేధిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనిదే ఎంతకాలమైనా అమలు సాధ్యం కాదు.  
– మహేశ్, గోల్నాక 

ఉన్నది భూమి ఒక్కటే.. కాపాడుకోవాలి..  
ఈ సంవత్సర పర్యావరణ దినోత్సవ థీమ్‌ ‘ఉన్నది ఒక్కటే  భూమి’. దీన్ని పరిరక్షించుకునేందుకు వివిధ అంశాలతోపాటు ప్లాస్టిక్‌ వినియోగం మానేయాలి. భూమి, నీటిలో సైతం అంతం కాకుండా  ఏళ్ల తరబడి ఉండే ప్లాస్టిక్‌  ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తుంది.     
– అశోక్‌ చక్రవర్తి, కవి 

(చదవండి: ‘సన్‌’ స్ట్రోక్స్‌! ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...)

మరిన్ని వార్తలు