అలర్ట్‌: జీహెచ్‌ఎంసీకి వెళ్లాలనుకుంటున్నారా...

27 Mar, 2021 08:25 IST|Sakshi

బల్దియాలో ఆంక్షలు 

కోవిడ్‌ కేసుల నియంత్రణకేనని జీహెచ్‌ఎంసీ ప్రకటన

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై పాక్షిక ఆంక్షలు విధిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలోని పలు విభాగాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగానూ కేసులు పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని  అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా  ఆంక్షలు ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా కచ్చితంగా కోవిడ్‌ నియమ నిబంధనలు పాటించాలని.. భౌతిక దూరం, మాస్క్‌లను ధరించడం, హ్యాండ్‌ వాష్‌ విధిగా పాటించాలని పేర్కొంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల సందర్శనపై కూడా ఈ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది. 

ఏవైనా ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఉంటే  మై–జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా చేయాలని, లేదా సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం వద్ద నున్న గ్రీవెన్స్‌ సెల్‌లో దరఖాస్తులు అందజేయాలని కమిషనర్‌ పేర్కొన్నారు. అధికారులు, సెక్షన్లలో సిబ్బందిని సాధ్యమైనంత మేర కలువరాదని ప్రజలకు  విజ్ఞప్తి చేశారు. ఈ ఆంక్షలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు, సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలో జరిగే కార్యక్రమాల అధికారిక సమాచారాన్ని సీపీఆరోఓ ద్వారా పత్రికా ప్రతినిధులకు అందచేయడం జరుగుతుందని, ఏదైనా అదనపు సమాచారం కోసం జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు అవసరమైతే మధ్యాహ్నం 3 గంటలనుండి 5 గంటల లోపు కార్యాలయంలోని సీపీఆర్‌ఓను మాత్రమే కలవాలని తెలిపారు. పాత్రికేయుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జీహెచ్‌ఎంసీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జీహెచ్‌ఎంసీలోని ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఐటీ, అకౌంట్స్, స్పోర్ట్స్‌ విభాగాల్లోని వారికి పదిమందికి పైగా కోవిడ్‌–19 నిర్ధారణ అయినట్లు తెలిసింది.   

చదవండి: ఆ రూ.450 కోట్లు వాళ్ల కోసమే!

మరిన్ని వార్తలు