పచ్చగా.. రెక్కలొచ్చెనా..రూ.137 కోట్లతో 57 థీమ్‌ పార్కులు

13 Jan, 2023 10:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక అయిన హరితహారం తోపాటు జీహెచ్‌ఎంసీలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. వీటిని కొనసాగిస్తూనే మరిన్నింటితో ప్రజలకు మంచి వాతావరణం తోపాటు కాలుష్యాన్ని తగ్గించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఇందులో భాగంగా థీమ్, ట్రీ పార్కులతో పాటు ప్రధాన రహదారుల మార్గాల్లోని సెంట్రల్‌ మీడియన్లలోనూ పచ్చదనం కార్యక్రమాలను తలపెట్టింది. రూ.137 కోట్లు వెచ్చింది 57 థీమ్‌ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా చేపట్టిన పనుల్లో 6 పార్కుల పనులు పూర్తయ్యాయి. 

ట్రీపార్కులు.. 
కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో ప్రజలకు ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ట్రీపార్కుల ఏర్పాటు చేపట్టారు. ఇప్పటి వరకు 406 ట్రీ పార్కుల్ని ఏర్పాటు చేశారు. వీటిలో ఎల్‌బీనగర్‌ జోన్‌లో 104, చార్మినార్‌ జోన్‌లో 23, ఖైరతాబాద్‌ జోన్‌లో 86, శేరిలింగంపల్లి జోన్‌లో 97, కూకట్‌పల్లి జోన్‌లో 56, సికింద్రాబాద్‌ జోన్‌లో 40 ఉన్నాయి.  

సెంట్రల్‌ మీడియన్లలో సైతం.. 
వివిధ రకాల పార్కులతో పాటు రోడ్ల మధ్యన సెంట్రల్‌ మీడియన్లలో ఇతరత్రా ఖాళీ ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పెంపు చర్యలు చేపట్టారు. వీటిలో పూలమొక్కలు సైతం పెంచుతున్నారు. మొక్కలతో  వాహన కాలుష్యం తగ్గడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాల లైట్లు గ్లేర్‌ కొట్టకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 186 సెంట్రల్‌ మీడియన్ల లొకేషన్లలో 176 కిలోమీటర్ల మేర పచ్చదనం  పెంచి అందంగా కనిపించేలా చేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

గత సంవత్సరం ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  దశాబ్ద కాలానికి (2011–21) సంబంధించి వెల్లడించిన నివేదికలో దేశంలోని మిగతా  నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే పచ్చదనం విస్తీర్ణం అత్యధికంగా 48.66 చదరపు కిలోమీటర్లు పెరిగింది. నగరంలో పచ్చదనం 5.23 శాతం నుంచి దాదాపు 13 శాతానికి పెరిగింది. ట్రీసిటీగా కూడా గుర్తింపు పొందడం తెలిసిందే. ఆ నివేదిక స్ఫూర్తితో పచ్చదనం పెంపునకు బల్దియా పాటుపడుతోంది. 

(చదవండి: పని మీది.. పరిష్కారాలు నావి!)

మరిన్ని వార్తలు