సర్వత్రా ఉత్కంఠ.. సీల్డ్‌ కవర్‌లో సీక్రెట్‌

11 Feb, 2021 02:18 IST|Sakshi

నేడే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక

గ్రేటర్‌ తెరపైకి కేకే కూతురు

విజయలక్ష్మి, మోతె శ్రీలత, సింధు ఆదర్శ్‌రెడ్డి పేర్లు

డిప్యూటీ మేయర్‌ పదవి కూడా మహిళకే?

నేటి ఉదయం 8.30కు తెలంగాణ భవన్‌లో భేటీ

కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులకు ఆహ్వానం

హాజరుకానున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్త మేయర్‌ ఎంపికపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్‌ అఫీషియో సభ్యుల సాయంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులు పార్టీ ఖాతాలో చేరనుండటంతో మేయర్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై టీఆర్‌ఎస్‌ నేతల్లో ఆసక్తి నెలకొంది. మేయర్‌ అభ్యర్థి పేరును సీల్డ్‌ కవర్‌లో పంపిస్తామని స్వయంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. సుమారు అరడజను కార్పొరేటర్ల పేర్లు మేయర్‌ పదవికి తెరమీదకు వస్తున్నా గ్రేటర్‌ పరిధిలోని మంత్రులకు కూడా ఈ విషయంలో ఎలాంటి సమాచారం లేదని వారి సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. 

తెరమీదకు వస్తున్న పేర్లు ఇవే..
టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి (బంజారాహిల్స్‌), మోతె శ్రీలత (తార్నాక), సింధు ఆదర్శ్‌రెడ్డి (భారతీనగర్‌) పేర్లు ప్రధానంగా తెరమీదకు వస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెపుతున్నాయి. వీరితో పాటు చింతల విజయశాంతికి ఓ మంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనలను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్‌ మేయర్‌ అభ్యర్థిని బుధవారం రాత్రి ఖరారు చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే డిప్యూటీ మేయర్‌ పదవిని మైనారిటీ మహిళలకు ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి అల్లాపూర్‌ డివిజన్‌ నుంచి ఎన్నికైన రెహనా బేగంకు అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకారానికి
గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో అల్పా హారం తర్వాత కార్పొరేటర్లు, గ్రేటర్‌ పరిధిలోని మంత్రులు కూడా జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి ప్రత్యేక బస్సులో తరలి వెళ్తారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాతే పార్టీ అధినేత కేసీఆర్‌ సీల్డ్‌ కవర్‌లో సూచించిన మేయర్‌ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశ ముందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతు కీలకం కావడంతో మేయర్‌ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి అసంతృప్తి బయట పడకుండా ఉండేందుకు నాయ కత్వం చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తున్నట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.

ఆశావహుల ఇళ్ల వద్ద హడావుడి
సీల్డ్‌ కవర్‌ ద్వారా మేయర్‌ అభ్యర్థి పేరును ప్రకటిస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించినా ఔత్సాహిక అభ్యర్థుల ఇళ్ల వద్ద బుధవారం సాయంత్రం నుంచే హడావుడి నెలకొంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవి, విజయారెడ్డి, మన్నె కవిత అనుచరులు కూడా తమ కార్పొరేటర్లకు అవకాశముందంటూ హడావుడి చేస్తుండ టంతో ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే పార్టీ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను గురువారం ఉదయం 8.30కు పార్టీ రాష్ట్ర కార్యా లయం తెలంగాణ భవన్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆదేశించింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఉదయం 9 గంట లకు జరిగే ప్రత్యేక భేటీలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావుతో పాటు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు పాల్గొంటారు. 

చదవండి: (గోదారితో కాళ్లు కడుగుతా: సీఎం కేసీఆర్‌)

మరిన్ని వార్తలు