హైదరాబాద్‌ మేయర్‌ పవర్స్‌ ఎంటో తెలుసా​?

14 Feb, 2021 08:36 IST|Sakshi

మేయర్‌.. కమిషనర్ల అధికారాలపై  ప్రజల్లో ఆసక్తి 

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎవరా అన్న చర్చలు చోటు చేసుకోగా, ప్రస్తుతం మేయర్‌కున్న పవరేమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. మేయర్‌ పదవి కోసం ఎందరెందరో పోటీపడటం.. తీవ్ర స్థాయిలో పైరవీలు చేయడం.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైతం మేయర్‌ అభ్యర్థిని ప్రకటించేందుకు ఆచితూచి వ్యవహరించడం.. చివరి నిమిషం వరకు అభ్యర్థిని వెల్లడించకుండా తీవ్ర ఉత్కంఠ రేపడం.. సీల్డు కవరుకు మొగ్గు చూపడం తదితర కారణాలతో మేయర్‌ అధికారాలపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. జీహెచ్‌ఎంసీలో ఉన్నతాధికారి కమిషనర్‌ కాగా, కమిషనర్‌ అధికారాలేమిటి..మేయర్‌ అధికారాలేమిటి..అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల మేరకు అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం ఎవరేం చేయవచ్చునంటే..

మేయర్‌ పవర్‌ ఇలా..

 • జీహెచ్‌ఎంసీ పాలకమండలి సర్వసభ్యసమావేశాలను ఏర్పాటు చేయడం. 
 • సదరు సమావేశాలకు మినిట్స్‌ రూపొందించడం. 
 • సర్వసభ్య సమావేశానికి అధ్యక్ష వహించి సభ నిర్వహించడం. 
 • సర్వసభ్య సమావేశాల్లో రూ. 6 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలపడం. 
 • వారం వారం జరిగే  స్టాండింగ్‌ కమిటీ సమావేశానికీ అధ్యక్షత వహించడం. 
 • జీహెచ్‌ఎంసీకి సంబంధించి ఏ కొత్త పాలసీని అమలు చేయాలన్నా స్టాండింగ్‌ కమిటీ ఆమోదం అవసరం. 
 • రూ.3 కోట్ల వరకు పనులకు ఆమోదం తెలిపే అధికారం స్టాండింగ్‌ కమిటీకి ఉంది.  
 • జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారులు, ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేసే సమయాల్లో కమిషనర్‌ మేయర్‌ను సంప్రదించాలి.  
 • ప్రమాద ఘటనల్లో మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల వరకు నష్టపరిహారంగా చెల్లించేందుకు పవర్‌ ఉంటుంది.  

కమిషనర్‌ అధికారాలిలా..

 • జీహెచ్‌ఎంసీకి సంబంధించినంత వరకు కమిషనర్‌ సర్వోన్నతాధికారి. 
 • పనులు చేసేందుకు రూ.2 కోట్ల వరకు నిధులు మంజూరు చేసే అధికారం. 
 • అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం. 
 • ఆస్తిపన్ను విధింపు, వసూళ్లు..ఇతరత్రా ఫీజుల వసూళ్లు. 
 • అవసరాన్ని బట్టి రూ.5 లక్షల వరకు పనుల్ని నామినేషన్లపై ఇవ్వవచ్చు. 
 • ప్రభుత్వంతో సంప్రదింపులు..ప్రభుత్వ నిర్ణయాల అమలు బాధ్యత. 
 • పాలకమండలి నిర్ణయాలు ప్రభుత్వానికి తెలియజేయడం. 
 • పాలకమండలిలో ఆమోదించిన బడ్జెట్‌ను ప్రభుత్వానికి నివేదించడం.  
 • నిర్ణయాలు తీసుకునే అధికారం మేయర్, పాలకమండలిది కాగా, వాటిని అమలు చేసే బాధ్యత కమిషనర్, అధికారులది.

చదవండి: మేయర్‌ ప్రేమ కథ: ఒప్పించాం.. ఒక్కటయ్యాం

మరిన్ని వార్తలు