Telangana: సైకిల్‌ సవారీకి సై 

25 Aug, 2022 08:32 IST|Sakshi

సాక్షి హైదరాబాద్‌: గ్రేటర్‌ ప్రజలకు సైకిల్‌ అలవాటు చేసేందుకు ప్రస్తుతం  జోన్‌కు రెండు మూడు సైకిల్‌ట్రాక్‌ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. క్రమేపీ ప్రజలకు అలవాటయ్యాక నగరవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. సైకిల్‌ వినియోగంతో ఆరోగ్యానికి మంచి వ్యాయామంతో పాటు పర్యావరణ హితం, ఇంధన వినియోగం తగ్గడం, ఇతర వాహనాల వినియోగం వల్ల వెలువడే కాలుష్యం తగ్గడం వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు సైకిళ్లకు అలవాటు పడేందుకు ప్రస్తుతానికి జోన్‌కు రెండుమూడు సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో జోన్‌లో ఒక్కో డిజైన్‌తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పరిశీలించాక అన్ని విధాలా యోగ్యమైన డిజైన్‌తో నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఎంపిక చేసే డిజైన్లతో తాత్కాలిక, శాశ్వత రెండు రకాలైన సైకిల్‌ట్రాక్స్‌ను ఏర్పాటు  చేసే యోచనలోనూ అధికారులున్నారు. రోడ్లు 3 లేన్లు, అంతకంటే ఎక్కువ ఉన్న మార్గాల్లో శాశ్వత సైకిల్‌ట్రాక్స్‌ ఏర్పాటు చేస్తారు. కొత్తగా మోడల్‌ కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రాంతాల్లోనూ శాశ్వత సైకిల్‌ట్రాక్స్‌ ఏర్పాటు చేస్తారు.

అంతకంటే తక్కువ లేన్లున్న మార్గాల్లో మాత్రం తాత్కాలిక సైకిల్‌ట్రాక్స్‌ ఏర్పాటు చేస్తారు. వీటిని ఉదయం  వేళల్లో దాదాపు రెండుగంటలు మాత్రం సైకిల్‌ ట్రాక్స్‌గా కేవలం సైకిళ్లను మాత్రమే వినియోగిస్తారు. ఆ సమయాల్లో మిగతా వాహనాలు ఆ ట్రాక్‌లోకి రాకుండా బొలార్డ్స్‌ వంటివి ఉంచుతారు. మిగతా సమయాల్లో వాటిని తొలగించడం వల్ల అన్ని వాహనాలు ప్రయాణిస్తాయి.  ఇక తాత్కాలిక, శాశ్వత సైకిల్‌ట్రాక్స్‌ రెండింటిలోనూ విపరీతమైన వాహన రద్దీ ఉండే సమయాల్లో ఆ ట్రాక్స్‌లో మోటార్‌బైక్స్‌ ప్రయాణానికి అనుమతించే యోచన ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.  

ఈ ప్రాంతాల్లో ఏర్పాటు..   
టోలిచౌకి–షేపేట, బయోడైవర్సిటీ జంక్షన్‌–లెదర్‌పార్క్, ఖాజాగూడ–నానక్‌రామ్‌గూడ, బయోడైవర్సిటీపార్క్‌– ఐకియా, గచ్చిబౌల జంక్షన్‌–బయోడైవర్సిటీ, మెహిదీపట్నం–గచ్చిబౌలి, నర్సాపూర్‌రోడ్‌  తదితర మార్గాల్లోని  సైకిల్‌ ట్రాక్స్‌ అందుబాటులోకి వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఐడీఎల్‌ లేక్‌–జేఎన్‌టీయూ–ఫోరమ్‌మాల్‌ సర్క్యూట్‌ ట్యాంక్‌బండ్‌–పీవీఎన్‌ఆఆర్‌ మార్గ్‌రోడ్‌–ఎన్టీర్‌ మార్గ్‌రోడ్‌ సర్క్యూట్‌గానూ సైకిల్‌ట్రాక్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  

తొలిదశలో మారి్నంగ్‌వాక్‌ మాదిరిగా  సైకిల్‌ తొక్కడం అలవాటయ్యేందుకు మాత్రమే నిరీ్ణత దూరాల వరకు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు బాగా అలవాటుపడ్డాక ఎక్కువ దూరాలు వెళ్లేందుకు సైకిల్‌ ట్రాక్స్‌తో పాటు సైకిళ్లు  అద్దెలకిచ్చేందుకు షేరింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసే యోచనలో అధికారులున్నారు.   

(చదవండి: ప్రపంచానికే మానవ వనరుల శక్తిగా భారత్‌)

మరిన్ని వార్తలు