Hyderabad: జంక్షన్లు జిగేల్‌!.. రూ.6 కోట్లతో 2 కూడళ్లకు మెరుగులు

17 Aug, 2022 14:29 IST|Sakshi
అభివృద్ధిపర్చనున్న వైఎంసీఏ నమూనా చిత్రం 

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటి వరకు ఎస్సార్‌డీపీ ద్వారా వివిధ ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌ కారిడార్లు, అండర్‌పాస్‌లు వంటి సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చిన జీహెచ్‌ఎంసీ.. ఇక జంక్షన్ల అభివృద్ధి, సుందరీకరణ తదితర పనులపై దృష్టి సారించింది. రూ.వేల కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మించి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించినప్పటికీ, పలు జంక్షన్లు చూపరులను ఆకట్టుకునేలా లేవు. కొన్ని మాత్రం వివిథ థీమ్‌లతో, ఆయా ప్రాంతాల్లో సుపరిచితమైన విగ్రహాలు వంటి వాటితో  ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో తగిన విధంగా లేవు.

దీంతో మొదటి దశలో భాగంగా జోన్‌కు రెండు చొప్పున మోడల్‌ జంక్షన్లుగా ఆధునికంగా, ఆహ్లాదంగా, అందంగా ఉండేలా అభివృద్ధి చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌.. జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తమ జోన్‌లోని జంక్షన్లను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సికింద్రాబాద్‌ జోన్‌లోని నారాయణగూడ వైఎంసీఏ జంక్షన్, సికింద్రాబాద్‌లోని సంగీత్‌ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్నారు.

సంగీత్‌ జంక్షన్‌లో ఎంతో కాలం క్రితమే సంగీత వాద్య పరికరాలు ఉంచి ప్రయాణికుల దృష్టి అటు మళ్లేలా చేసినప్పటికీ, ఆ జంక్షన్‌ను మరింత సుందరంగా, అందంగా అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావించారు. అలాగే వైఎంసీఏ వద్దా ఎంతో అభివృద్ధి చేయవచ్చని భావించి పనులకు సిద్ధమవుతున్నారు. సంగీత్‌ జంక్షన్‌ పనులకు రూ. 2.92 కోట్లు, వైఎంసీఏ జంక్షన్‌ పనులకు రూ.2.90 కోట్లు వ్యయమవుతాయని, రెండింటికీ కలిపి రమారమీ రూ. 6 కోట్ల వరకు ఖర్చు కావచ్చని అంచనా వేస్తున్నారు. టెండర్లు పూర్తవగానూ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 
చదవండి: Hyderabad: 9న గణేష్‌ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ

జంక్షన్లు విశాలంగా వాహనాలు సాఫీగా మలుపులు తిరిగేలా రోడ్లను వెడల్పు చేస్తారు. అవసరాన్ని బట్టి ఆస్తుల సేకరణ జరుపుతారు. జంక్షన్ల మధ్య ఉండే వలయాకార భాగాల్లో గ్రీనరీ, ఫౌంటెన్లు వంటి ఏర్పాట్లు చేస్తారు. కూర్చునేందుకు వీలుగా బెంచీలు.. ఇతరత్రా స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ఏర్పాటు చేస్తారు. జంక్షన్లలోని అన్నివైపులా పాదచారులు సులభంగా రోడ్డు దాటేలా ఏర్పాట్లు. అందుకోసం మార్కింగ్‌లు. అవసరమైన చోట పెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు  చేయనున్నారు.

జంక్షన్ల నుంచి వివిధ మార్గాలవైపు వెళ్లే రోడ్ల మధ్య డివైడర్లలో అందంగా కనిపించేలా, ఆక్సిజన్‌ ఇచ్చేలా పచ్చదనం పెంచుతారు. అన్నివైపులా బస్టాప్‌లు ఉండేలా చూస్తారు. ఫ్రీలెఫ్ట్‌.. తదితర సదుపాయాలు అందుబాటులోకి  తెస్తారు.  విద్యుద్దీపాల ధగధగలతో జంక్షన్లు రాత్రుళ్లు మెరిసిపోయేలా చేస్తారు.  

మరిన్ని వార్తలు