కూకట్‌పల్లిలో ‘స్మార్ట్‌’ పార్కింగ్‌, గంటకు రూ.10 మాత్రమే!

11 Mar, 2021 14:57 IST|Sakshi

ప్రత్యేక యాప్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ 

ఏర్పాట్లు పూర్తి,  కేటాయింపే తరువాయి 

ఒకేసారి 200 ద్విచక్రవాహనాలు నిలిపేలా వసతి  

కేపీహెచ్‌బీలో ఏర్పాటు 

కేపీహెచ్‌బీకాలనీ: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్న భాగ్యనగరంలో పార్కింగ్‌ ఓ సవాల్‌గా మారింది. ముఖ్యంగా షాపింగ్‌ మాళ్లు కొలువుదీరిన ప్రాంతాల్లోనైతే పార్కింగ్‌ కోసం పరేషాన్‌ కావాల్సిందే. ఈ క్రమంలో ట్రాఫిక్‌ సమస్య సైతం ఉత్పన్నమై అటు వాహన చోదకులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులకూ తలనొప్పిగా మారుతోంది. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల కారణంగా పార్కింగ్‌ సమస్య గుదిబండగా మారిన దృష్ట్యా ‘స్మార్ట్‌’ పార్కింగ్‌ దిశగా జీహెచ్‌ఎంసీ ముందడుగు వేసింది.

ఒకప్పుడు ఫ్లైఓవర్‌ నిర్మాణం అంటే ట్రాఫిక్‌ రద్దీ, ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం నిరి్మంచేవారు. కానీ.. నేడు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం ఆధునిక సాంకేతికతకు అద్దం పట్టడంతో పాటు ఆధునిక హంగులకు నిలయంగా మారింది.  రద్దీకి చిరునామైనా కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ఫోరం మాల్‌ ఎదురుగా ఫ్లైఓవర్‌ కింద నగరంలోనే మొదటిసారిగా చేపట్టిన సెన్సార్‌ బేస్డ్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రమే ఇందుకు నిదర్శనం.  

► దాదాపుగా రూ. 48 లక్షలతో ఏర్పాటు చేసిన సెన్సార్‌ బేస్డ్‌ స్మార్ట్‌ పార్కింగ్‌లో 200 ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. 
► అక్కడ పార్కింగ్‌ చేసుకోవాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించి యాప్‌ ద్వారా పార్కింగ్‌ వసతి కోసం బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
► నేరుగా స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రానికి వెళ్లినా స్లాట్‌ ఖాళీగా ఉంటేనే అనుమతి లభిస్తోంది.  
► పార్కింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లగానే ముందుగానే యాప్‌లో పొందుబర్చిన వివరాల ఆధారంగా వాహన నెంబర్‌ను సెన్సార్‌ స్కానర్లు ఆటోమేటిక్‌గా స్కాన్‌ చేస్తాయి.  
► కేటాయించిన పార్కింగ్‌ గడిలో వాహనాన్ని పార్క్‌ చేసినప్పటి నుంచి మళ్లీ వాహనం తీసుకెళ్లే సమయాన్ని ఆటోమేటిక్‌గా సెన్సార్‌ స్మార్ట్‌ పార్కింగ్‌ సిస్టమ్‌ గణించి గంటకు రూ.10ల చొప్పున చెల్లించాలని సూచిస్తుంది. ఆ మేరకు చెల్లింపు పూర్తి కాగానే వాహనంతో బయటకు వెళ్లేందుకు గేటు ఓపెన్‌ అవుతుంది. 
► ఇందులో మహిళలతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక స్లాట్లను సైతం ఏర్పాటు చేశారు. 
► ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా త్వరలోనే టెండర్‌ ప్రక్రియను పూర్తి చేసి నిర్వహణ బాధ్యతల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు.  

► స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రానికి ఎదురుగానే ఫోరం సుజనామాల్, పక్క వీధిలో డీ–మార్ట్‌ వంటి షాపింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉండగా గంటకు రూ.10 చొప్పున స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రాన్ని వాహనదారులు ఏ మేరకు వినియోగించుకుంటారనేది సందేహంగానే ఉంది.  
► షాపింగ్‌ మాల్స్‌లో మొదటి అరగంట ఉచిత పార్కింగ్‌ అవకాశం ఉండడంతో పాటు ఏదైనా షాపింగ్‌ చేసినా బిల్లు చూపిస్తే మిగతా సమయానికి పార్కింగ్‌ ఉచితంగానే లభిస్తుంది.  
► ఈ నేపథ్యంలో స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రంలో గంటకు రూ.10కి బదులు 2, 3 గంటలకు రూ.10 చొప్పున వసూలు చేస్తే ఉపయోగం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
► మరో వైపు ప్లైఓవర్‌ బ్రిడ్జి పిల్లర్లపై వేయించిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.  

మరిన్ని వార్తలు