hyderabad: మట్టిగణపతుల తయారీ.. సగానికి తగ్గిన వ్యయం

9 Aug, 2022 08:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు రూ.3 కోట్ల విలువైన మట్టి గణపతుల విగ్రహాల తయారీని కేవలం పెద్ద ఏజెన్సీలకు కట్టబెట్టాలనుకున్న జీహెచ్‌ఎంసీ.. ‘సాక్షి’లో వెలువడిన కథనంతో దిగివచ్చి చిన్న సంస్థలకు సైతం అవకాశం కలిగేలా పిలిచిన రీటెండర్లలో ఆరు సంస్థలకు విగ్రహాల తయారీ, సరఫరా అవకాశం లభించింది. తప్పదన్నట్లుగా.. రీటెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ 8 అంగుళాల చిన్నవిగ్రహాల సంఖ్యను లక్ష తగ్గించింది.

తొలి టెండరులో ఇవి 3.60 లక్షలు కావాలని పేర్కొనగా, రీటెండరు నోటిఫికేషన్‌లో అసలు ఎన్ని కావాలో పేర్కొనలేదు. టెండర్ల ఖరారు సమయంలో 2.60 లక్షలు చాలునని పేర్కొంది. దీని వెనుక మతలబేమిటో సంబంధిత అధికారులకే తెలియాలి. ఎటొచ్చీ తొలుత అంచనా వ్యయం రూ.3 కోట్లు కాగా,  అంతిమంగా రూ. 1.54 కోట్లతో దాదాపు సగానికి తగ్గింది.  

ఒకే ఏజెన్సీకి కాకుండా ఎక్కువ సంస్థలు పాల్గొనేలా చేయడంతోపాటు ఎల్‌ 1 ధరకు ముందుకొచ్చే అందరికీ అవకాశం కల్పిస్తామనడంతో 6 సంస్థలు ఆ అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఒక అడుగు విగ్రహాలకు ఒక్కో విగ్రహం అంచనా వ్యయం రూ.134 కాగా, టెండరులో రూ.130కి, ఒకటిన్నర అడుగు విగ్రహాలకు ఒక్కోదానికి అంచనా వ్యయం రూ. 349 కాగా, టెండరులో రూ.323లకు అప్పగించారు. 8 అంగుళాలవి  అంచనా వ్యయం రూ.34.90 కాగా, టెండరులో రూ.31.90కి అప్పగించారు.  
చదవండి: గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక: కేసీఆర్‌

టెండర్లు పూర్తయిన విగ్రహాల వివరాలు
ఒక అడుగువి: 30,000 
అడుగున్నరవి: 10,000 
8 అంగుళాలవి: 2,60,000
  

►ఎల్‌ 1 రేట్లుగా  వీటిని ఖరారు చేసి ఆరు సంస్థలకు అప్పగించారు. టెండర్లు దక్కించుకున్న సంస్థల్లో సనాతన ఆహార్‌ హస్తకళా ప్రైవేట్‌ లిమిటెడ్, జైగణేశ్‌ ఆర్ట్స్, స్వామి కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ కాంట్రాక్టర్స్, ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియా పాటరీస్, క్లే గణేశ స్టాట్యూస్‌ మాన్యుఫ్రాక్చరర్స్‌ సొసైటీలున్నాయి. విగ్రహాలన్నీ ప్రజలకు ఉచితంగా పంచేందుకు ఉద్దేశించినవే అయినప్పటికీ,  8 అంగుళాల విగ్రహాలు ఏకంగా లక్ష ఎందుకు తగ్గించుకున్నట్లో ఉన్నతాధికారులకే తెలియాలి. తొలుత అవసరానికి మించి టెండరు పిలిచారా.. లేక ఇంకేదైనా కారణముందా అన్నది అనుమానాలకు తావిస్తోంది. ఉచితంలోనూ ఔచిత్యం లేకపోవడం కొత్త ప్రశ్నలకు తావిస్తోంది.   

మరిన్ని వార్తలు