‘మాకు నచ్చిందే చెబుతాం, అది అంతే, మేమింతే’

17 May, 2021 08:00 IST|Sakshi

అదే సంఖ్య, అదే లెక్క!

జీహెచ్‌ఎంసీలో 63 కంటైన్మెంట్‌ జోన్లు 

గత మూడు వారాలుగా అవే వివరాలు 

వెబ్‌సైట్‌లో మార్పుచేర్పుల్లేవ్‌.. 

అంతుబట్టని అధికారుల వైఖరి 

నగరంలో కరోనా పరిస్థితులపై 

నేడు మంత్రి తలసాని సమీక్ష  

సాక్షి, సిటీబ్యూరో: ‘మాకు నచ్చిందే చెబుతాం. కావాలనుకున్నప్పుడే తెలుపుతాం. అది అంతే. మేమింతే..’ అన్నట్లుంది జీహెచ్‌ఎంసీ వైఖరి. మూడు వారాల క్రితం గతనెల 22వ తేదీన గ్రేటర్లో 63 కంటైన్మెంట్‌ జోన్లున్నాయంటూ జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఐదు నుంచి పది పాజిటివ్‌ కేసుల వరకు ఒక కంటైన్మెంట్‌ జోన్‌గా పేర్కొంటూ ఆ వివరాలు ఉంచారు. ఒక అపార్ట్‌మెంట్‌లో ఐదారుగురికి కరోనా ఉన్నా ఒక జోన్‌గా చూపారు. అప్పటి నుంచి ఆ సంఖ్య మారలేదు. అలాగే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పుచేర్పుల్లేవు. ఏదో ఒక్కరోజు మాత్రమే  తెలపాలనుకున్నప్పుడు  వెబ్‌సైట్‌లో ఎందుకు ..? అని ప్రశ్నిస్తున్నవారికి సమాధానాల్లేవు.

ఓవైపు సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా సమాచారం అందజేయాలని ప్రభుత్వం లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో పేర్కొన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఎలాంటి మార్పుల్లేవు. ట్విట్టర్‌ వంటి మాధ్యమాల ద్వారా కూడా తాజా సమాచారం లేదు. కంటైన్మెంట్‌ జోన్లు ఎక్కడె క్కడున్నాయో తెలిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు వీలుంటుందని భావించి వెబ్‌సైట్‌లో పెట్టారనుకున్నారు. ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు తెలుస్తాయనుకున్నారు.  కానీ మార్పుచేర్పుల్లేకపోవడంతో తాజా సమాచారం తెలియడం లేదు.

తాజా వివరాలుంటే లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ, మినహాయింపు సమయంలోనైనా ప్రజలకు ఉపయుక్తంగా ఉండేది. ఇంటింటి ఫీవర్‌ సర్వేకు సంబంధించి సైతం ఎన్ని ఇళ్లలో సర్వే చేశారన్నది వెల్లడించడం తప్ప ఎన్ని ఇళ్లలో ఎంతమందికి జ్వరం ఉంది.. ఎంతమందికి మందుల కిట్స్‌ అందజేశారనే వివరాలు గోప్యంగానే ఉంచుతున్నారు. నగరవ్యాప్తంగా జ్వరాలున్నవారిలో   50,662 మందికి మందుల కిట్స్‌ అందజేసినట్లు ఆదివారం మేయర్‌ విజయలక్ష్మి పేర్కొన్నారు.  
(చదవండి: మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే)

నేడు మంత్రి తలసాని సమీక్ష 
జీహెచ్‌ఎంసీ  చేస్తున్న పనుల్లో సగం వెల్లడిస్తూ, సగం గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలకు అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కరోనా వ్యాధి బారిన పడిన వారికి అందుతున్న సేవలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం ఉదయం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు.

మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్,  కలెక్టర్లు, వైద్య,ఆరోగ్యశాఖ, తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఎన్ని కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు..ఎన్ని పాజిటివ్‌గా గుర్తించారు.. ప్రతిరోజు జరుగుతున్న పరీక్షలు..వ్యాక్సినేషన్‌ జరుగుతున్న తీరు, నగరంలో ఎన్ని ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ సరఫరా, మందుల సరఫరా వంటి అంశాలపై సమీక్షించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
(చదవండి: లాక్‌డౌన్‌: తెగ తిరుగుతున్నారు!)

మరిన్ని వార్తలు