మాస్కు ఉంటేనే ఓటు

19 Nov, 2020 08:22 IST|Sakshi

మాస్కు లేకుంటే పోలింగ్‌ స్టేషన్లోకి నో ఎంట్రీ 

బ్యాలెట్‌ బాక్స్‌లు చేర్చే సిబ్బందికి పీపీఈ కిట్లు 

ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతి 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాలు  

సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్‌ బాక్సులను తీసుకెళ్లే సిబ్బందికి, బ్యాలెట్‌ పేపర్లను ఒక దగ్గరకు చేర్చే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథికి సమగ్ర మార్గదర్శకాలను అందజేశారు. ఆ ప్రకారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కార్యకలాపాల్లో పాల్గొనే వారందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. లేకుంటే పోలింగ్‌ స్టేషన్లలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ‘నో మాస్క్‌ నో ఎంట్రీ’అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ‘భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది తమ కార్యకలాపాలను పెద్ద పెద్ద హాళ్లలో నిర్వహించుకోవాలి. పోలింగ్, భద్రతా సిబ్బంది కిక్కిరిసినట్లు వెళ్లకుండా తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఎన్నికల సిబ్బంది అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల’ని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.      

ఆరడుగుల దూరం  
పోలింగ్‌స్టేషన్‌కు వచ్చే ఓటర్ల మధ్య ఆరడుగుల దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సందర్భంగా కోవిడ్‌ జాగ్రత్తలను పర్యవేక్షించేందుకు వార్డు స్థాయి వరకు నోడల్‌ హెల్త్‌ ఆఫీసర్లను నియమించాలి. పోలింగ్‌ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే, తక్షణమే వారి స్థానంలో రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలి. అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల ఖర్చులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చు. నామినేషన్‌ సమర్పించడానికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికే అనుమతి ఇస్తారు. రెండు వాహనాలకే అనుమతి. 

మరికొన్ని మార్గదర్శకాలు...  
-   ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి.  
- పోలింగ్‌స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి కేటాయించాలి.  
-   ఓటర్ల మధ్య ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా వలయాలు గీయాలి. వాటిల్లో ఓటర్లు నిలబడేలా పర్యవేక్షించాలి.  
-    స్త్రీ, పురుషులు, వికలాంగులు/ సీనియర్‌ సిటిజన్లకు... మూడు క్యూలు ప్రత్యేకంగా ఉండాలి.  
-    అవకాశముంటే సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు క్యూలలో నిలబడకుండా నేరుగా పోలింగ్‌స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలి.  
-    భౌతికదూరాన్ని పర్యవేక్షించేందుకు వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలి.  
-    కోవిడ్‌ అవగాహనకు పోస్టర్లు ప్రదర్శించాలి.  
-   సిబ్బంది, ఏజెంట్ల కోసం పోలింగ్‌స్టేషన్లలో భౌతికదూరం పాటించేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేయాలి.  
-    మాస్క్‌ లేకుండా ఓటర్లను పోలింగ్‌స్టేషన్లలోకి అనుమతించరు. అయితే ఓటరును గుర్తించేందుకు ఒకసారి మాస్క్‌ను తొలగించి వెంటనే పెట్టుకోవచ్చు.  
-   ప్రతి పోలింగ్‌ అధికారి ముందు ఒక ఓటరు మాత్రమే నిలబడటానికి అనుమతిస్తారు.  
-    పోలింగ్‌ అధికారులకు, భద్రతా సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్‌లు ఇస్తారు. 
-    ఇంటింటి ప్రచారానికి అభ్యర్థితో కలిపి ఐదుగురు వెళ్లొచ్చు.  
-   రోడ్‌షోలలో వాహనాల మధ్య 100 మీటర్ల దూరం పాటించాలి.  
-    ఒకేమార్గంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీ రోడ్‌ షోలు ఉంటే, వాటి మధ్య కనీసం అరగంట తేడా ఉండాలి.  
-    కరోనా ప్రొటోకాల్‌ ప్రకారం బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. పర్యవేక్షించడానికి హెల్త్‌ రెగ్యులేటర్లను నియమించాలి.  

మరిన్ని వార్తలు