Telugu Language Day: నేడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి

29 Aug, 2021 08:18 IST|Sakshi

సాక్షి, విద్యానగర్‌(కరీంనగర్‌): భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామ్మూర్తి కృషితో తెలుగుకు కొత్త వెలుగులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల పాలకుల నిర్వాకం, నిబద్ధత లేని కారణంగా ప్రస్తుతం అమ్మ భాష రోజురోజుకూ ప్రాధాన్యత కోల్పోతూ నిరాదరణకు గురవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పరభాషా వ్యామోహం పెంచుకుంటున్నారు. తెలుగులో రాయడం ఆత్మన్యూనతగా, ఆంగ్ల మాధ్యమంలో చదవడం నాగరికంగా మా రాయి. ఫలితంగా సొంత గడ్డపైనే తెలుగు పరాయిదైపోయింది.

రాష్ట్ర ఏర్పాటుకు ఊతమిచ్చిన తెలంగాణ భాష ప్రత్యేకమైనది. ఆ భాషకు న్న శక్తితోనే కవులు, రచయితలు అందించిన సాహిత్యం ఉద్యమానికి చైతన్యం తీసుకువచ్చింది. తెలంగాణ భాష పదజాలం పౌరుషాన్ని, రోషాన్ని నింపి రాష్ట్ర సాధన వరకు వెన్నుదన్నుగా నిలిచిన మన అమ్మ భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది.

సదాస్మరణీయుడు..
తెలుగుభాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు సదాస్మరణీయం. తెలుగు భాషలో గ్రాంథిక వాదానికి స్వస్తి చెప్పి, వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన భాషోద్యమకారుడాయన. గిడుగు జయంతినే తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పని చేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవరమని చెప్పారు. 1913లో వ్యవహారిక భాషలోనే విద్యాబోధన జరగా లని ఆనాటి మద్రాస్‌ గవర్నర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు.

తెలుగు–సవర, ఇంగ్లిష్‌–సవర నిఘంటువులను, గద్య చింతామణి, వ్యాసావళి, నిజమైన సంప్రదాయం మొదలగు గ్రంథాలు ఆయన కీర్తిని ప్రకాశమానం చేశాయి. తెలుగు భాషలోని సొబగులను సామాన్య ప్రజలకు అందించడంలో గిడుగు ప్రయత్నం ప్రశంసనీయం. 1919లోనే మొట్టమొదటి తెలుగు వ్యవహారిక భాషా పత్రికను స్థాపించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అ ప్పారావు వంటి సాహితీవేత్తలతో కలిసి అదే ఏడాది ఆంధ్రాభాష ప్రవర్తక సమాజాన్ని స్థాపించారు. సామాన్యుల పట్ల మనకు శ్రద్ధ ఉండాలని, పేదవారి ముఖాల్లో వెలుగులు విరజిమ్మాలంటే భాషాసంస్కరణ ఒక్కటే మార్గమని గట్టిగా విశ్వసించిన ఆయన 1940 జనవరి 22న స్వర్గస్తులయ్యారు.

తెలుగును పరిరక్షించాలి
ఉన్నత తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మాతృ భాషలో బోధన కొనసాగిస్తూ తెలుగు భాషను పరిరక్షించాలి. ప్రాథమిక చదువులు తల్లి భాషలో సాగితేనే జ్ఞానార్జన, ఆలోచనాశక్తిని, ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. ప్రభుత్వం కూడా తెలుగు చదివిన వారికి ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తే తెలుగు నిత్యనూతనమై విరాజిల్లుతుంది.          – దాస్యం సేనాధిపతి, కవి, రచయిత, సాహితీ విమర్శకులు

మాతృభాష వైపు మళ్లాలి
ప్రపంచీకరణ ప్రభావంతో మన భాషా సంస్కృతులను పరిరక్షంచుకునే ఆత్మరక్షణలో పడ్డాం. ఇది ఆత్మగౌరవ సమస్య. ఆంగ్ల భాష వ్యామోహంలో నుంచి మాతృభాష వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరం తెలుగు భాషను కాపాడున్నవారం అవుతాం. ఆ దిశగా ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి.

 – కేఎస్‌.అనంతాచార్య, కవి, రచయిత 

చదవండి: మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె

మరిన్ని వార్తలు