ట్రెండు మారుతోంది...ఆడబిడ్డే కావాలి..! ‘కారా’ దరఖాస్తు విధానం ఇలా!

28 May, 2022 15:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల దత్తతలో ట్రెండు మారుతోంది. ఇప్పుడు అమ్మాయి కావాలనే డిమాండ్‌ పెరుగుతోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలను పరిశీలిస్తే... దత్తత కోసం వచ్చే దంపతులు అమ్మాయిలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశీ దంపతులు సైతం అమ్మాయిల దత్తతకే మొగ్గు చూపుతున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 663 మంది పిల్లల్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దత్తత ఇచ్చింది. ఇందులో 190 మంది బాలురు, 473 మంది బాలికలు. వీరిలో విదేశీ దంపతులు 127 మందిని దత్తత తీసుకోగా... వారిలో బాలురు 38 మంది, 89 మంది బాలికలున్నారు. దత్తత వెళ్లినవారిలో బాలురతో పోలిస్తే బాలికలు దాదాపు రెండున్నర రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. 

ఇద్దరూ సమానమైనా... 
పిల్లల విషయంలో ఇప్పుడు ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇదివరకు మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.. వారిని ప్రైవేటు స్కూల్లో చేర్పించడం, ఉన్నత చదువులు చదివించడం కనిపించేది. కొన్నేళ్లుగా ఆ పరిస్థితులు మారిపోయాయి. అబ్బా యి, అమ్మాయి అనే తేడా కనుమరుగవుతోంది. పిల్లలెవరైనా సమాన దృష్టితో చూసే భావన పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకే కాస్త ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రులిద్దరికీ ఆడబిడ్డతోనే అనుబంధం ఎక్కువగా ఉంటోందని పలు సర్వేలు సైతం చెబుతున్నాయి. 

‘కారా’ దరఖాస్తుతో దత్తత
కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పిల్లల దత్తత కోసం కారా (సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ) అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్న దంపతులు ముందు ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు, అర్జీదారుల ఇంటికెళ్లి ప్రత్యేకంగా పరిశీలిస్తారు.

దత్తత తీసుకుంటే.. పిల్లలను పోషించే స్తోమత ఉందా? కుటుంబ నేపథ్యం ఏమిటి? వంటివి తెలుసుకున్న తర్వాతే ఆన్‌లైన్‌ దరఖాస్తును ఫార్వర్డ్‌ చేస్తారు. తరువాత.. పిల్లల లభ్యత ఆధారంగా దరఖాస్తుదారులకు ఫోన్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్‌ ద్వారా సమాచారం ఇస్తారు. దరఖాస్తుదారు సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధికారులు ఆ మేరకు సమాచారమిస్తుంటారు. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలనైనా దత్తత తీసుకో వచ్చు. భారత ప్రభుత్వం, విదేశీ దంపతులకు సైతం దత్తత వెసులుబాటును కల్పించింది.  

మరిన్ని వార్తలు