అమ్మనూ కోల్పోయింది

20 May, 2021 03:34 IST|Sakshi
రోదిస్తున్న సంజన.చిత్రంలో ఆమె తమ్ముడు హనుమ

తమ్ముడితో కలిసి కరోనాతో పోరాటం

టిమ్స్‌ ఆస్పత్రిలో బెడ్‌ దొరక్క వీల్‌చైర్‌లోనే విగతజీవిగా మారిన తల్లి

తండ్రిని బతికించాలంటూ ఆమె పడిన వేదనను ఈ నెల

14న వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’అమ్మనూ కోల్పోయింది

సాక్షి, హిమాయత్‌నగర్‌: ‘కాళ్లు పట్టుకుంటా.. మా నాన్నను బతి కించండి’ అంటూ కనిపించిన వైద్యుల కాళ్లా వేళ్లాపడినా.. చివరకు నిస్సహాయస్థితిలో మొన్న తండ్రిని పోగొట్టుకున్న సంజన.. ఇప్పుడు తల్లినీ కోల్పోయింది. ‘మా అమ్మను బతికించండి సార్‌’ అంటూ టిమ్స్‌ వైద్యులను వేడుకుంటే, ‘మేం చూసుకుంటాం’ అని చెప్పి పంపిన వైద్యులు కాసేపటికే ‘మీ అమ్మ చనిపోయిందం’టూ చావు కబురు చెప్పారు. వారం వ్యవధిలో తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని ఇప్పు డు తమ్ముడితో కలిసి దైన్య పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన జగదీశ్, గీత దంపతులు. వీరికి సంజన, హనుమ సంతానం. జ్వరంతో బాధపడుతున్న తల్లికి సంజన ఈ నెల 5న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది.

వెంటనే ఆమెను కింగ్‌కోఠిలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించింది. వైద్యులు ఆక్సిజన్‌ బెడ్‌పై చికిత్స అందించారు. రెండ్రోజుల తర్వాత తండ్రికి కూడా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అదే ఆస్పత్రిలో చేర్పించింది. కొద్దిరోజులకు తండ్రి పరిస్థితి విషమించింది. ఆయనకు ఐసీయూ బెడ్‌ సమకూర్చేందుకు సంజన ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అక్కడ కనిపించిన తెల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరి కాళ్లావేళ్లాపడింది. చివరకు బెడ్‌ దొరకని దయనీయ పరిస్థితుల్లో ఆయన ఈ నెల 13న మరణించారు. నాడు సంజన కన్నీరుమున్నీరైన తీరును, ఆమె వేదనను కళ్లకుకడుతూ ‘కాళ్లు పట్టుకుంటా.. మా నాన్నను బతికించండి’ శీర్షికతో ఈ నెల 14న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది.

ఎవరూ కనికరించలేదు..
వారం వ్యవధిలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన దురదృష్టవంతురాలిని. తండ్రిని రక్షించుకునేందుకు కింగ్‌కోఠి ఆçస్పత్రిలో అందరి కాళ్లావేళ్లాపడ్డా కనికరించలేదు. తల్లినైనా కాపాడుకోవాలని తండ్రి శవా న్ని వదిలేసి ప్రైవేట్‌ ఆస్పత్రికి పరిగెత్తా. వాళ్లు నా బాధ పట్టించుకోలేదు. అమ్మ ను రక్షించండి.. అని మంత్రి కేటీఆర్‌ను వాట్సాప్‌లో రిక్వెస్ట్‌ చేశా. ఆయన స్పందించి ఆస్పత్రికి ఫోన్‌ చేయిస్తే, ఫోన్‌ చేయిస్తావా అంటూ వైద్యులు కసురుకున్నారు. అక్కడ అమ్మకు సరిగా వైద్యం అందదనే భయంతో గచ్చిబౌలిలో ‘టిమ్స్‌’కు తీసుకెళ్లా. పడకల్లేవంటూ సమయం వృథాచే యడంతో అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకు, తమ్ముడికి పాజిటివ్‌.
– సంజన 

ఫిర్యాదు చేసిందని ప్రైవేట్‌ ఆస్పత్రి వీరంగం
తండ్రి చనిపోయిన అరగంటకే తల్లి గీత పరిస్థితి విషమించింది. ఒకపక్క తండ్రి మృతదేహం.. ఆ బాధను దిగమింగుకుంటూనే సంజన.. తల్లిని కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి కర్మన్‌ఘాట్‌ బైరామల్‌గూడలోని ఓ ప్రెవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు గీతను సరిగా పట్టించుకోకపోగా, ఒక్కరోజుకే రూ.2 లక్షలు బిల్లు వేశారు. అసలే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంజన తల్లినైనా కాపాడుకోవాలనుకుంది. మంత్రి కేటీఆర్‌ వాట్సాప్‌ నంబర్‌ను సంపాదించి ‘నా తల్లిని రక్షించండి’ అంటూ ఈ నెల 15న మెసేజ్‌ చేసింది. దీనికి ‘ఓకే’ అంటూ కేటీఆర్‌ రిప్‌లై ఇచ్చిన అరగంటకే సదరు ఆస్పత్రికి ఫోన్‌ వెళ్లింది. అంతే.. కొద్దిసేపటికే ఆమెపై ఆస్పత్రి యాజమాన్యం మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ విరుచుకుపడింది.

వీల్‌చైర్‌లోనే తుదిశ్వాస..
సదరు ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు సరిగా చూడటం లేదని భావించిన సంజన.. తల్లిని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రికి తరలించింది. అక్కడా బెడ్స్‌ ఖాళీలేని పరిస్థితి.. దీంతో వైద్యులు సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం రాత్రి 2 గంటల వరకు వీల్‌చైర్‌లోనే ఉంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌పైనే గీతకు చికిత్స అందించారు. ‘ఏదైనా బెడ్‌ ఖాళీ కాగానే చేరుస్తాం. మీరు వెళ్లిపోండి. మేం చూసుకుంటాం’ అని వైద్యులు సంజనకు చెప్పారు. ఆ కొద్దిసేపటికే తల్లి చనిపోయిందంటూ వైద్యుల నుంచి ఫోన్‌ వచ్చింది. 

కథనం చూసి చలించా
తండ్రిని బతికించుకోడానికి సంజన పడిన తపన గురించి ‘సాక్షి‘లో చదివాను. మనసు చివుక్కుమంది. వెంటనే సంజనకు, హనుమకు కోవిడ్‌ టెస్టులు చేయించాను. అంబులెన్స్‌ను, కొంత డబ్బును సమకూర్చాను. వాళ్ల తల్లిని బతికించాలని, డబ్బు ఎంత ఖర్చయినా భరిస్తానని ప్రైవేటు ఆసుపత్రి వాళ్లతో మాట్లాడాను. కానీ, పేషెంట్‌ పరిస్థితిని నాకుగానీ, సంజనకుగానీ వారు చెప్పలేదు. 
– శ్రావ్య మందాడి, ‘వీ అండ్‌ షీ’ వ్యవస్థాపకురాలు 

మరిన్ని వార్తలు